మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
నేడు "ప్రపంచ మహిళామణుల దినోత్సవం"
ఒకాయన సంతకి వెళ్ళి ఓ మేకపిల్లని కొన్నాడు. నలుగురు దొంగలు అది గమనించి ఎలాగైనా ఆ మేకపిల్లని కొట్టేయాలని అనుకుని ఒక మంచి ఉపాయం ఆలోచించారు. ఆయన మేకపిల్లని తీసుకుని తన ఊరికి నడిచి వెడుతున్నాడు. అరమైలు వెళ్ళగానే ఒక దొంగ ఎదురుగా వచ్చి " కుక్కపిల్ల బాగుంది, ఎంతకు కొన్నారు " అన్నాడు. ఈయన ఇది మేకపిల్ల అని చెప్పి ఎదరకి వెళ్ళిపోయాడు. అరమైలు వెళ్ళగానే ఇంకోదొంగ ఎదురువచ్చి " కుక్కపిల్ల ఎంతముద్దుగా ఉందో, ఎంతకి కొన్నారు " అన్నాడు. ఈయన " ఇది మేకపిల్లండి బాబూ కుక్కపిల్లకాదు " అన్నాడు. మిగతా ఇద్దరు దొంగలూ కూడా అలాగే అనడంతో ఈయనకి అనుమానం వచ్చింది, ఇది నిజంగానే కుక్కపిల్లేమో, అందరూ ఎందుకు అలా అంటారు అని అనుకుని దాన్ని రహదారి ప్రక్క వదిలేసి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. దొంగలు ఆ మేకపిల్లని తీసుకుని చెక్కేసారు.
ఇది అంతా ఇప్పుడు ఎందుకంటే మన వేదాలని ( 20500 మంత్రాలు ), ఉపనిషత్తులని, పురాణాలని, శాస్త్రాలని, రామాయణం ( 24000 శ్లోకాలు ), మహాభారతం ( 100700 శ్లోకాలు ), శృతులు, స్మృతులు ముఖ్యంగా మనుస్మృతిని రకరకాల కట్టుకధలు చెప్పి చెప్పి భ్రష్టుపట్టించేసారు.
వేదవిజ్ఞానం ఎంత ఉత్కృష్టమయినది. ఎన్నిరకాల శాఖలు ఎన్ని ఋక్కులు ఎన్ని సూక్తాలు. ఒక వేదంలోని ఒకశాఖని పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. అ ఆ లు రానివాడు కూడా వేదాలు గురించి మాట్లాడడమే.
మనుస్మృతి లో " నస్త్రీ స్వాతంత్ర్యమర్హసి ( 9:3 ) " అని ఉందిట. స్త్రీకి స్వాతంత్ర్యం అక్కరలేదంటాడా, అలా ఎలా అంటాడు అని ఓ చర్చ. ఆయనే " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ( 3:56 ) " అన్నారు కదా. దానిగురించి ఏమంటారు. దేవతలందరికీ అధిపతి అమ్మవారు. మొదటగా " మాతృదేవోభవ " అనమన్నారు, అమ్మ తరువాతే ఎవరయినా. యమద్వితీయ నాడు మగవారు అందరూ వారి సొదరీమణుల ఇంటికి వెళ్ళి భోజనం ( భగినీ హస్త భోజనం ) చేస్తే ఆయుష్షు పెరుగుతుందని తెలియచేస్తున్నాయి పురాణాలు. శ్రావణపౌర్ణమి నాడు రాఖీ కట్టమన్నాయి సోదరీమణులకు. ఆదిశంకరులు దేవీ అపరాధక్షమా స్తోత్రంలో " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి " - చెడ్డ కొడుకు ఉంటాడేమోకాని చెడ్డతల్లి ఎప్పుడూ ఉండదు " అన్నారు. స్వతంత్ర్యం ఉండకూడదంటే కట్టిపడేయడం కాదు, ఒంటరిగా వదిలేయకు, ఎప్పుడూ తోడుండు అని.
ఒక అరబ్బుదేశంలో స్త్రీ బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక దగ్గరిబంధువు ( స్నేహితుడు కుదరదు ) తోడు ఉండాలని చట్టం చేసింది(ట).
ఇలా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళందరూ కూడా తమ కుమార్తెగాని, భార్యగాని రాత్రి/తెల్లవారకట్ట విమానాశ్రయానికి వెళ్ళవలసి వస్తే మాత్రం కూడా తనో కుమారుడో వారి కూడా ఉండేలా చూసుకుంటారు కాని ఒంటరిగా పంపించే ధైర్యం చెయ్యరు. ఇవన్నీ ఊహించే వేలసంవత్సరాల క్రితమే అటువంటి కట్టుబాట్లు చేసింది మన సనాతనధర్మం. అవి ఇప్పటికి ఎప్పటికీ నిత్యనూతనమే
ఒక అన్యమతస్తుడు ( మొన్నటికి మొన్న ) " మనుస్మృతి " ని పొగుడుతూ " అద్భుతం " అని అనడం చదివినప్పుడు ఆనందమూ బాధా కలిగాయి. ఎంత భ్రష్టుపట్టించేసారు మన సనాతనధర్మానిని అని బాధ కలుగుతుంది.
" ఎద్దుకేమి తెలుస్తుంది అటుకుల రుచి " అని సామెత. నిజమేనని అనిపిస్తూంది.
నేడు " ప్రపంచ మహిళామణుల దినోత్సవం ". మనకు జన్మనిచ్చి తీర్చిదిద్దిన, మన కష్టసుఖాల్లో తోడూనీడగా నిలిచిన మహిళామణులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుందాం.
సర్వే జనాః సుఖినో భవంతు. హమారా సనాతనధర్మ మహాన్ - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment