భోగాలు అనుభవించవచ్చు, భోగాసక్తి ఉండకూడదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్,
తద్వత్ కామా యం ప్రవిశంతి
సర్వే స శాంతి మాప్నోతి న కామకామీ "
- భ.గీత 2:70
" సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింప జేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్తభోగములును స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు " అన్నారు పరమాత్మ.
కంచి పరమాచార్యులు ఎవరయినా " సేవ " కు తమ ప్రాంతానికి రమ్మని ఆహ్వానిస్తే వీలుని బట్టి సమ్మతిని తెలియచేసి వీలు చూసుకుని వచ్చేవారు.
మాబాబయ్యగారు ( పిన్నిగారి భర్త ) సంస్కృతపండితులు. చాలా కావ్యాలు వ్రాసారు. ఆరోజుల్లోనే 1950-60 లలో 3000 ప్రవచనాలు చేసారు. అద్భుత విద్వత్తు వలన కంచి పరమాచార్యులకు ఆప్తమిత్రులయారు.
మా బాబయ్యగారి చివరిరోజుల్లో ఊరిపెద్దలు కంచివెళ్ళి పరమాచార్యులను కలిసి పరిస్థితి వివరించి " మేము సేవకు ఏర్పాటు చేసుకుంటాం, మీరు మా గ్రామానికి వస్తే శాస్త్రిగారు కూడా సంతోషిస్తారు " అని కోరితే పరమాచార్యులు " సేవ ఖర్చులు మీరు భరించలేరు. అమలాపురం వారు రమ్మని అడుగుతున్నారు. తొందరలో అటు వస్తాను. శాస్త్రిగారిని కలుస్తాను. అడిగానని చెప్పండి " అని పంపించేసారు.
విషయమేమిటంటే ఆయన సేవకు ఆరోజులలోనే 10 వేల రూపాయలు అయేదిట. అంటే ప్రస్తుతం 20-25 లక్షలకు సమానం. ఆయనతో బాటు శిష్యులు, సేవకులు, గోవులు రావడం జరిగేది. అటువంటి ఏర్పాట్లన్నీ అమ్మవారి నిరంతరం అభిషేకాలకు, అర్చనలకు తప్పనిసరి.
ఇది చదవగానే/వినగానే సామాన్యులకు అంత ఖరీదయిన సేవా, అంత భోగమా అనిపిస్తుంది. అలా అనిపించడంలో తప్పు లేదు.
అమ్మవారు అఖిలాండేశ్వరి, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి. ఆవిడకు సేవలు మామూలుగా ఎలా ఉంటాయి. వైభవంగా ఉండాలి/ఉంటాయి. కాని ఈ భోగాలతో పరమాచార్యులకు ఏమీ సంబంధం ఉండదు. ఆయన భోగాసక్తికి అతీతులు. అందుకే " నడిచే దేముడు " అని కోట్లమందితో పూజింపబడ్డారు. అటువంటి వారికి ఎప్పుడూ ఆనందమే. సచ్చిదానందమూర్తి. ఇదే పరమాత్మ గీతలో చెప్పినది.
ఇటువంటి వారి వలననే సనాతనధర్మం ఇప్పటికీ మూడు పువ్వులు ఆరు కాయలుగా శోభిస్తూంది.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణపరమాత్మార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment