ఏపనీ చేయకుండా కూర్చోకూడదు, కూర్చోలేరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నైష్కర్మ్యా " - అమ్మవారి అద్భుతనామం . ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 900 వ నామం . 

నైష్కర్మ్యా అంటే వేదోక్త కర్మలు కలిగియుండినను కర్మ సంబంధము లేకుండుట.

సృష్టి స్థితి లయలు, జీవులకు వారివారి కర్మలకు అనుగుణంగా ఫలాలు ఇవ్వడం లాంటి విద్యుక్తకర్మలు చేస్తూన్నా ఆ కర్మల సంబంధాలేమీ అమ్మవారికి ఉండవు. " పద్మపత్రమివాంభసా " అంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది అమ్మవారు.

ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో చెబుతారు అర్జునుడికి:

" న కర్మణామనారంభాత్  

  నైష్కర్మ్యం పురుషో2శ్నుతే.

  న చ సన్న్యసనాదేవ              

  సిద్ధిం సమధిగచ్ఛతి " 

                  - భ.గీత 3:4

మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. 

దీని అర్థం కంచి పరమాచార్యులయినా లోకకళ్యాణంకోసం చంద్రమౌళీశ్వరునికి అభిషేకం, అమ్మవారు కామాక్షీదేవికి అర్చనలు నిత్యమూ చేస్తూంటారు. భక్తులు వస్తే నాలుగు మంచిమాటలు చెబుతూంటారు, ఎవరయినా భక్తితో సేవకు పిలిస్తే వెడుతూంటారు. ఏ కర్మలు చెయ్యను అని కూర్చోరు. అలా కూర్చుంటే అమ్మవారు సంతోషించరు, సిద్ధి లభించదు ఆయనకు ఎరుకే.

రామాయణం సుందరకాండ లో ఓ అద్భుత విషయం ఉంది. హనుమకు ఓ ధర్మసందేహం వస్తుంది. సీతమ్మకోసం వెదుకుతూ పుష్పకవిమానం లోకి ప్రవేశిస్తారు హనుమ. అక్కడ రావణుడుతో బాటు ఎందరో స్త్రీలు మదిరపానంచేసి ఆదమరచి వస్త్రాలు కూడా సరిగ్గా లేకుండా అస్తవ్యస్తంగా నిద్రిస్తూ ఉంటారు. వస్త్రాలు సరిగ్గా లేని స్త్రీలను చూడడం తప్పు. " తను ధర్మం తప్పాడా " అని హనుమ ఒక్క క్షణం కలవరపడతారు. ఒక్క క్షణమే. వెంటనే అనుకుంటారు " సీతమ్మజాడ తెలియాలంటే స్త్రీలనే తేరిపారి చూడాలి, వేరే దారిలేదు. నా కళ్ళు చూస్తున్నాయికాని నా మనస్సు చలించలేదు. అంటే ఏ దోషమూ నాకు అంటలేదు, అంటదు, నేను అధర్మం చేయలేదు " అని.

వ్యాసర్షి పెళ్ళిచేసుకుని సంతానాన్ని పొందమంటారు కొడుకు శుకుడిని. శుకుడు " ససేమిరా " అనడంతో జనకమహారాజు వద్దకు వెళ్ళి జీవిత సత్యం తెలుసుకోమంటారు. సరే అని శుకుడు వెళ్ళేసరికి జనకుడు సభా కార్యక్రమాలు చేస్తూంటారు. ఇంతగా మామూలు పనుల్లో మునిగిపోయిన ఈయనేం తత్వం చెబుతాడు అనుకుని శుకుడు వెళ్ళిపోతూంటాడు. అప్పుడు జనకుడు శుకుడిని పిలిచి కూర్చోబెట్టి విషయం తెలుసుకుని దూరంగా నృత్యప్రదర్శన జరుగుతూన్నచోట కాపలాగా ఉన్న భటుడిని పిలిపిస్తాడు. భటుడితో " అందరూ నృత్యాలు, కీర్తనలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు, నీకు ఎలా అనిపించింది " అని అడుగుతాడు. భటుడు " క్షమించండి రాజా నన్ను నృత్యం చేస్తూన్న స్త్రీలకు హాని జరగకుండా కాపలా కాయమన్నారు. నాలుగువైపులా పరిశీలిస్తూ జాగ్రత్తగా కాపలాకాస్తున్నాను. నృత్యం గురించి కాని కీర్తనలగురించి కాని పరిశీలనగా చూసే అవకాశమేలేదు నాకు " అని చెప్పగానే భటుడిని పంపించేసి శుకుడితో " నీ విద్యుక్తకర్మలు నువ్వు శ్రద్ధగా చేస్తూన్నంతకాలం లౌకికవిషయాలు నీ మనస్సులోకి ప్రవేశించవు. అదే జీవిత సత్యం. నేనైనా నువ్వైనా శ్రద్ధగా విద్యుక్తకర్మలు చేస్తూనే ఉండాలి. సభలో నేను రాజుగానే ఉండాలి " అని చెబుతాడు. శుకుడు అబ్బురపడి ఎన్నో తత్వవిషయాలు తెలుసుకుంటారు జనకుడి దగ్గర.

సత్పురుషుల మనస్సు అలా ఉంటుంది. తప్పు జరగడానికి అవకాశమే ఇవ్వదు. కర్మలు చేస్తూనే ఉంటారు కాని ఆ కర్మల ఫలాలు వారికి అంటవు. నైష్కర్మ్యులు.

కర్మలు చేయకుండా ఉండడం ఎలాగూ కుదరదు కనుక మనస్సు చలించకుండా ఎల్లప్పుడూ మంచి కర్మలే చేస్తూ ఉండేలా అనుగ్రహించమని అమ్మవారు " నైష్కర్మ్య " ని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ