కోరిక మహా చెడ్డది, తస్మాత్ జాగ్రత్త - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" ధూమేనావ్రియతే వహ్నిః,
యధా దర్శో మలేనచ,
యధోల్బేనావృతో గర్భః,
తధా తేనేదమావృతం " - భ.గీత 3:38
" పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే కప్పివేయబడును " అన్నారు పరమాత్మ.
ఇక్కడ కామము అంటే కోరిక. దీనికి అంతులేదు. ఒకటి తరువాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. ఎలాగయినా తీర్చుకోవాలనుకున్నప్పుడు కోపం ద్వేషం అహం పెరుగుతాయి.
ధర్మరాజుది ఎంతటి అద్భుత వ్యక్తిత్వమో చూద్దాం.
12 ఏళ్ల అరణ్యవాసానికి వెడుతూన్నప్పుడు ద్రౌపది " ఎప్పుడూ ధర్మం ధర్మం అంటారు. ధర్మంని అనుసరిస్తూన్న మీరు అరణ్యం పాలయ్యారు. అధర్మం చేస్తూన్నవాడు రాజ్యం ఏలుతున్నాడు " అని అంటే అప్పుడు ధర్మజుడు " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ - ధర్మం నా స్వభావం మరి ( ఏమి చెయ్యమంటావు )" అంటారు.
అంతటి అమితధర్మపరుడు, అజాతశత్రువు ధర్మజుడు. రాజసూయ యాగం చేసాడు, కృతజ్ఞతగా శ్రీకృష్ణుడిని గౌరవించుకున్నాడు, ఆ సభలోనే శిశుపాలుడిని సంహరించారు స్వామి.
అన్ని అద్భుతవిషయాలను చూసిన ఆయన " పాచికలాడుదాం రా " అని దుర్యోధనుడు పిలుస్తే వెళ్ళారు. సరే. పిలిచినది ఎవరు, ఆడువలసినది ఎవరు. " నాబదులు శకుని ఆడుతాడు " అని దుర్యోధనుడు అంటే సరే అన్నాడు. రాజ్యాన్ని, తనని, తన సోదరులని కూడా ఓడాడు. ఆఖరికి ఆశ్చర్యకరంగా భార్యని పందెంగా పెట్టి ఓడాడు. ఇదంతా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు కాని ఆశ్చర్యపడక్కరలేదు.
అదే స్వామి చెప్పినది " జ్ఞానమును కామము ( నెగ్గాలనే కోరిక, నెగ్గితీరుతామనే అహం ) కప్పేస్తుంది " అని.
ధర్మరాజు పరిస్థితే అలాగుంటే పిపీలకముల( చీమల)పాటి చెయ్యని సామాన్య జీవుల పరిస్థితి ఏమిటి.
హిరణ్యకశిపుడిని సంహరించాక నృసింహస్వామి " ఏదయినా వరం కోరుకో " అంటారు ప్రహ్లాదుడితో. ప్రహ్లాదుడు " యా ప్రీతిరవివేకానాం విషేశ్వరపాయిని " - " అవివేకులకు అవసరంలేని విషయాలపై ఎంతప్రీతి ఉంటుందో నీమీద నాకు అంతప్రీతి ఉండేలా అనుగ్రహించు స్వామీ " అని కోరుకుంటాడు. ఎంత అద్భుతమయిన కోరిక, పోలిక.
కోరిక లేకపోతే జీవితం నిస్సారం. మన కోరికలు ధర్మబద్ధంగా, సమంజసంగా, ఆరోగ్యకరంగా ఉండేలా అనుగ్రహించమని పరమాత్మని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment