శక్తికిమించి పూజలు జపాలు చేయనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అశాస్త్రవిహితం ఘోరం 

  తప్యంతే యే తపో జనాః, 

  దంభాహంకారసమ్యుక్తాః 

  కామరాగబలాన్వితాః 

  కర్షయంతః శరీరస్థం 

  భూతగ్రామమచేతసః, 

  మాం చైవాంతఃశరీరస్థం 

  తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్       

               - భ.గీత 17:5,6

" శాస్త్రవిహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను దంభాహంకారములతో ఒనరించువారును, కామరాగములచే ప్రేరేపింపబడినవారును, దేహమును దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టేవారిని అసురులుగా తెలియబడుదురు " అన్నారు పరమాత్మ.

డాంబికము, అహంకారంతో ఎవరో చేసారు మనమూ చేద్దాం అనేకాని మనకు అవసరమా, శక్తి చాలుతుందా అనే ఆలోచన ఉండదు కొందరికి. ఎంత అద్భుత విషయం తెలియచేసారు పరమాత్మ.

లలితాసహస్రనామాలను లలితాసహస్ర "రహస్య " నామాలు అంటారు. అవి ఎందుకు రహస్యము అంటే అవి చదవకపోవడంవలన నష్టంలేదు, అమ్మవారు కోప్పడరు. కాని వాటిలో నామాలు ఛందోబద్దంగా ఉంటాయి. బీజాక్షరాలు ఉంటాయి. తప్పుగా చదివితే నష్టం ఎక్కువ. 

అలాగే గాయత్రీమంత్రం చాలా శక్తివంతమయినది. ఉపనయనసమయంలో గురువు తండ్రి చెవిలో చెపుతూంటే తండ్రి కొడుకు/వటువు చెవిలో చెబుతారు, ప్రక్కనున్న కన్నతల్లికి కూడా వినబడకుండా. ఉపనయనం అయాకే గాయత్రీజప పారాయణకు అర్హత వస్తుంది. మరి అంత రహస్యమయిన జపాన్ని బయటకు చెప్పడం, అందరూ జపించాలనుకోవడం దేనికి, కోరి కష్టాలు తెచ్చుకోవడం దేనికి.

నా వయస్సుకు, దేహదారుఢ్యానికి 15 కేజీల బరువు ఎత్తగలను అనుకుందాం. 30 కేజీలు ఎత్తడానికి ప్రయత్నం చేయడం దేనికి.

డిగ్రీ చదివినప్పుడు ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవారు. తరచుగా " ప్రకృతి క్రూరమైనది‌ " అనేవారు. ఉదా: చంటిపిల్లవాడు ప్రాకుకుంటూ వెళ్ళి నిప్పులో చేయిపెట్టాడు. అయ్యో చంటిపిల్లవాడు, ఏమీ తెలియదు పిల్లాడికి అని ఆ నిప్పు జాలిపడి ఊరుకోదు, చేయి కాలుస్తుంది. 

మంత్రాలు కూడా అటువంటివే. జాగ్రత్తగా, దూరంగా ఉండడం శ్రేయస్కరం.

" యజ్ఞనాం జపయజ్ఞో2స్మి - భ.గీత 10:25 " అన్నారు పరమాత్మ.

శ్రీరామ, నమోనారాయణాయ, నమశ్శివాయ అనుకో చాలు, పుణ్యం వస్తుంది అంటే కాదు ఆ రహస్యమంత్రాలనే చదవాలనే కుతూహలం ఎందుకు.

త్యాగయ్య కేవలం రామజపం చేసారు.‌96 కోట్ట్లు. కోటి చేసేటప్పటికే శ్రీరామదర్శనం అయింది. సులువుగా తరించే మార్గాలు ఎన్నో కనిపిస్తూంటే ఆ శక్తివంతమయిన మంత్రాల జోలికెందుకు పోవడం.

కొందరు ఎన్ని చెప్పినా వినరు, గాయత్రీ మంత్రమే చదువుతాం అంటారనే

వేదవ్యాసుడు అందరూ చేసుకునే " గాయత్రీ " మంత్రాన్ని కూడా ఇచ్చారు:

" సర్వచైతన్య రూపం తాం 

‌  ఆద్యం విద్యాంచ ధీమహి 

  బుద్ధిం యానః ప్రచోదయాత్ " 

శక్తికి మించిన పని వదిలేసి అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం. అవ్యాజకరుణామూర్తి అనుగ్రహిస్తుంది. సంశయం నాస్తి.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ