" ప " వర్గాలంటే ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏
అమ్మవారికి అష్టోత్తరశతనామాలతో పూజ చేస్తూంటాం. వాటిలో ఒక అద్భుతనామం " అపవర్గప్రదాయైనమః " అని ఉంటుంది.
స్వామికి పూజ చేసేటప్పుడు " అపవర్గప్రదాయనమః " అంటాము.
అంటే పవర్గాల బాధని పోగొడుతుంది అని అర్ధం. ఈ " ప " వర్గాలంటే ఏమిటో తెలుసుకుందాం.
హల్లుల్లోని ఐదేసి అక్షరాలని ఓ వర్గంగా చెప్పుకుంటాం. క వర్గం, గ వర్గం అలా. ప వర్గంలోనివి ప, ఫ, బ, భ, మ లు.
ప - పాపం, పుణ్యం
ఫ - ఫలం
బ - బంధము
భ - భయం
మ - మరణం*
* మరణం అంటే ఉపనిషద్ అర్ధం ఏమరుపాటు.
ఇవి ప వర్గాల క్రిందకు వస్తాయి. వీటినుంచి బయటపడవేసేవారే అపవర్గప్రదాయని. అసలు ఎందుకు అలా బయటపడవేయమని కోరుకోవడం.
సాధకుడు కోరుకునేది జీవన్ముక్తి, అంటే మోక్షం. స్వర్గం కాదు. పుణ్యఫలం అనుభవించడానికి మరణానంతరం స్వర్గంకి వెళ్ళినా ఆ పుణ్యఫలం అవగానే మళ్ళీ జన్మను తీసుకుంటాడు జీవుడు పాప ప్రక్షాళనకోసం. ఏసుఖానికైనా దుఃఖస్పర్శ ఉంటుంది. కాని స్వర్గం లో దుఃఖస్పర్శ ఉండదు. పాపం కూడా నశించాలంటే దుఃఖస్పర్శ తప్పదు. అందుకని మళ్ళీ జన్మతీసుకోవలసి వస్తుంది జీవుడికి. పాపపుణ్యాలు పూర్తిగా నశిస్తేనే జీవన్ముక్తి. మళ్ళీ జన్మ ఉండదు.
అందుకే ఈ పవర్గాలనుంచి బయటపడవేయమని అమ్మవారిని కోరుకోవడం.
ఈరోజు పవిత్రమైన హోళికా పూర్ణిమ. శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment