లక్ష్మీదేవిని పూజించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి - నేడు శ్రీలక్ష్మీ జయంతి, హోలీ - చీమలపాటి సూర్యనారాయణ-

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏

" మహాలక్ష్మీః " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 210 వ నామం.

" లక్ష్యభూతా లక్ష్మీః " - అందరి లక్ష్యం ( పొందగోరేది ) అమ్మవారే. అందుకే లక్ష్మీ నామం. 

శ్రీసూక్తంలో అమ్మవారిని ప్రార్ధిస్తూ " లోకైక దీపాంకురాం ( లోక+ఏక+దీప+అంకురాం ) అంటాం అంటే " లోకాలన్నింటికీ ఒకే ఒక్క దీపంగా ఉన్నది " అని. దీపం అంటే జ్ఞానం. లక్ష్మీదేవి జ్ఞానప్రదాత.

విష్ణుసహస్రనామాల్లో ఒక నామం " లక్ష్మీః " - లక్ష్మీ స్వరూపుడు అన్నారు శంకరాచార్యులు తన భాష్యంలో.

అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపురాలు. అమ్మవారిని పూజించేటప్పుడు మహాగౌరీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అని సంకల్పం చేస్తాం. అమ్మవారు త్రిగుణమయి - 3 గుణాల రూపిణి. 

శ్రీమహాలక్ష్మీ రజోగుణం. 

అమ్మవారికి ఆగుణాలేమిటి అనుకోవచ్చు. కాని అవసరమే. ఓ అమ్మ పిల్లాడిని ముద్దుచేస్తుంది, అడిగినవన్నీ పెడుతుంది. తప్పుచేసినప్పుడు కన్ను ఎర్ర చేసి " ఏయ్ " అంటుంది. ఇంకా అవసరమైతే వీపుమీద ఒకటి వేస్తుంది. శాంతంగా " తప్పునాయనా " అంటే ఉపయోగం ఉండదు, కోప్పడితేనే వాడు తప్పు అని తెలుసుకుని బాగుపడతాడు. అమ్మవారి మాయ, కోపం, దండన అన్నీ మన బాగుకోసమే.

మరుత్తుడనే రాజు యజ్ఞంచేసి బ్రాహ్మణులకు బంగారం దానం చేసాడు. వారు కొద్ది కొద్దిగా అవసరమయినది తీసుకుని మిగతా బంగారాన్ని హిమాలయాల క్రింద పాతిపెట్టేసారు. అలా ఎందుకు చేసారని అడిగితే " సంపద ఎక్కువయితే కోరికలు, అహం పెరుగుతాయి " అన్నారు.

చాణక్యుడు చంద్రగుప్తుడిని రాజును చేసాక చాణక్యుడిని కలవడానికి వెడతాడు నందుడు. రాజభోగాలలో మునిగి ఉంటాడని నందుడి అభిప్రాయం. రాజభవనానికి వెళ్ళాక చాణక్యుడు ఊరిబయట ఉంటున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. అక్కడకు వెడితే సరైన కప్పుకూడాలేని నీళ్ళు కారుతూన్న పూరిగుడిసె అది. చాణక్యుడు పేడపని చేస్తూ ఉంటాడు. " ఇదేమిటి " అని అడిగితే చాణక్యుడు అంటాడు " సంపదలు, సౌకర్యాలు పాముల వంటివి, ఎప్పుడయినా కాటు వెయ్యవచ్చు, వాటిని దూరం పెట్టాలి " అని. నందుడు తన " ముద్రారాక్షసం " లో వ్రాసుకున్నారు ఈ విషయాలు.

అమ్మవారు మహాలక్ష్మీ రూపంలో సంపదని ఇస్తుంది. కాని మాయలో ముంచేస్తుంది. జాగరూకతతో ఉండాలి, అవి అన్నీ అశాశ్వతాలు, మిధ్య అన్న ఎరుకతో ఉండాలి. 

ఇదే విషయాన్ని పరమాత్మ ఇలా అంటారు :

" దైవీ హ్యేషా గుణమయీ 

  మమ మాయా దురత్యయా" - " నా త్రిగుణాల ప్రభావంతో కూడిన మాయను తప్పించుకోవడం కష్టమే " - భ.గీత 7:14 - అని.

ఈరోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ రూపంలో అనుగ్రహిస్తున్నారు.

సంపదని ఇచ్చి , మాయలో కూరుకుపోకుండా, దానిని సత్కార్యాలకే ఉపయోగించుకునేలా అనుగ్రహించమని " శ్రీమహాలక్ష్మీ " అమ్మవారిని కోరుకుందాం. 

ఈరోజు పవిత్రమైన శ్రీలక్ష్మీదేవి జయంతి, హోలీ పండుగ. శుభాకాంక్షలు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ