డబ్బులేనివారు కూడా దానధర్మాలు చేయాలా - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీమాత్రేనమః " 🙏
" ధర్మాధారా " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 884వ నామం
" ధర్మాధారా " అంటే ధర్మమునకు ఆధారమైనది మరియూ ధర్మమును ఆధారముగా చేసినది. దేనికి ధర్మాన్ని ఆధారంగా చేసింది అని ఆలోచనచేస్తే " సృష్టి " కి అని తెలుస్తుంది.
" యతో ధర్మాణి ధారయన్ " అని చెప్పింది వేదం. సృష్టి అంతా ధర్మం మీదే ఆధారపడి ఉంది. అందుకే ఇంత లయబద్ధంగా అద్భుతంగా ఉంది. ధర్మబద్ధంగా ఏ పని చేసినా అది యజ్ఞంగా పిలవబడుతుంది.
ఈ నామం విష్ణుసహస్రంలో కూడా చెప్పబడింది. స్వామిని " ధర్మయూపా " అంటే " ధర్మములన్నీ తనయందే ఉన్నవాడు " అని పూజిస్తారు. " ధర్మగుబ్, ధర్మకృత్, ధర్మీ " అంటే " ధర్మాన్ని రక్షించేవాడూ, ధర్మాన్ని ఆచరించేవాడూ, ధర్మానికి ఆధారమై ఉన్నవాడు " అని పూజిస్తాం ఆయన్ని. " విశ్వధర్మములన్నిటికీ ఎవరు ఆధారమో ఆయనే పరమాత్మ " అని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేయమని ఎవరు చెప్పినా ఆయన అయోధ్యకు తిరిగిరానంటే చివరిగా వశిష్టులని నచ్చచెప్పమంటారు అందరూ. వశిష్టులు అంటారు " తండ్రి చనిపోయిన తరువాత పెద్దకొడుకే రాజు అని శాస్త్రాలు చెబుతున్నాయి, నువ్వు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యపాలన చెయ్యి, అది అధర్మం కాదు " అని. అప్పుడు రాముడు అంటారు " నేనే అలా చేస్తే ఎలా. తండ్రికి ఇచ్చిన మాటని తప్పడం ధర్మం కాదు. ప్రకృతి గతి తప్పుతుంది. సూర్యుడు, గాలి, భూమి అందరూ గతి తప్పుతారు. వర్షాలు పడక పంటలు సరిగ్గా పండవు. ప్రజలు నానాబాధలు పడతారు " అని. అందుకే రాక్షసుడి చేత కూడా " రామో విగ్రహవాన్ ధర్మః - రాముడు మూర్తీభవించిన ధర్మం " అని కీర్తింపబడ్డాడు. వేల సంవత్సరాల తరువాత కూడా నేటికీ పూజింపబడుతున్నాడు.
విదురుడు అంటారు " ధనవంతం అదాతారం, దరిద్ర్యంచ అతపస్వినం......." - ధనం ఉండి దానం చెయ్యనివాడిని, తపస్సుచెయ్యని దరిద్రుణ్ణి సముద్రంలో పడెయ్యాలని. ధనంలేనివారిని దానం చెయ్యమనలేదు మన సనాతనధర్మం, దేవుడి ధ్యానం చేసుకోమంది. అంత స్పష్టంగా ఉన్నాయి మన ధర్మాలు.
భక్తిని పోషించేది ధర్మం. భక్తి అంత సులువుగా ఏర్పడదు, ఎన్నో జన్మలు కష్టపడాలి.
" కోటి జన్మార్జితైః పుణ్యైః, భవేర్భక్తి ప్రజాయతే " - " కోటిజన్మలు పుణ్యం చేస్తేకాని భక్తిభావం కలగదు " అని భారతంలో కృష్ణుడు అంటారు.
ద్రౌపదితో దుర్యోధనుడు అంటాడు " నా ( ధర్మరాజు ) భర్తచేసినది అధర్మం అని అను, నిన్ను వదిలేస్తాను " అని. ఆవిడ అంటుంది " ఈ రోజు ఆయనకు దైవానుగ్రహం లేకపోవచ్చు కాని ఆయన ఎప్పుడూ ధర్మాన్ని మాత్రం తప్పరు " అని. ఆవిడ ధర్మస్వరూపురాలు. ఎప్పుడైతే కృష్ణుడిని ప్రార్ధించిందో " భక్తి, ధర్మం " కలవడం, వస్త్రాలు ఆవిడని చుట్టుకోవడం జరిగింది. " ధర్మః వస్త్రరూపేణ పావృణోత్తాం " - ఆవిడ ధర్మమే వస్త్రరూపంలో ఆవిడను చుట్టుకుందని అర్ధం.
ధర్మానికి అంత విలువనిచ్చి గౌరవించింది మన సనాతనధర్మం. ధర్మబద్ధుడవైతే అన్ని సౌకర్యాలను అమ్మవారే కలిగిస్తుంది. సంశయం నాస్తి.
" ధర్మో రక్షతి రక్షితః ".
సదా ధర్మబద్ధులుగా ఉండేలా అనుగ్రహించమని ఆ " ధర్మాధార " ని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment