శోకాన్ని పోగొట్టేవారు ఆనందాన్ని ఇచ్చేవారు శివుడు, మహాశివరాత్రి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" అక్షమాలాధరం రుద్రం
పార్వతీ ప్రియ వల్లభం,
చంద్రశేఖరమీశానం
ఏకబిల్వం శివార్పణం "
" రురుం ద్రావయతి ఇతి రుద్రః " - శోకాన్ని పోగొట్టేవాడు రుద్రుడు అని అర్ధం.
" శం కరోతి ఇతి శంకరః " - శుభాలను/ఆనందాన్ని కలిగించే స్వామి శంకరులు.
" త్రిగుణాతీతమై లోకాతీతమై సర్వాతీతమై శాంతమైన తత్వమే శివతత్వం " - ఆ స్థితిలో అంతా ఆనందమే. అదే సత్యం శివం సుందరం.
" చిన్మాత్రం అమలం శాంతం " - నిర్మలమైన జ్ఞానమయమైన శాంతం వలన మాత్రమే శివుడిని తెలుసుకో గలుగుతారని వామన పురాణం/యోగవాశిష్ఠ
మహారామాయణం తెలియచేస్తున్నాయి.
ఈరోజు శివునికి అత్యంత ప్రీతికరమయిన, శుభకరమయిన రోజు. మహాశివరాత్రి.
శివుడిని ఋషులు అడిగారు " స్వామీ అందమైన కైలాసంలో పార్వతితో హాయిగా గడపక ఇలా శ్మశానాలలో తిరుగుతూంటావు, ఎందుకని " అని.
స్వామి అన్నారు " జీవుడు పాపప్రక్షాళనకోసం, జన్మరాహిత్యం కోసం జన్మ తీసుకుని చాలా కష్టపడతాడు. వీలయినన్ని పుణ్యకార్యాలు చేస్తాడు. పెళ్ళిచేసుకుని కొందరికి జన్మనిచ్చి వారికోసం నానాపాట్లూ పడతాడు. తన సుఖాన్ని , తనముక్తినీ కూడా మరచిపోయి సంతానంకోసం ఆస్తులు సంపాదించిపెడతాడు. చివరికి చనిపోయాక జీవుడితో ఇంటిగుమ్మందాకా భార్య, ఊరిచివరిదాకా కొందరు, శ్మశానికి కొందరూ వస్తారు. దహనం అవగానే ఒక్కొక్కరు తిరిగి వెళ్ళిపోయాక జీవుడు ఒంటరిగా మిగిలిపోయి తను ఎంత మూర్ఖుడో, సమయాన్ని ఎలా వ్యర్ధం చేసుకున్నాడో తలచుకుని కుమిలిపోతాడు. ఆసమయంలో అతన్ని ఓదార్చడానికి ఎవరూ ఉండరు. అందుకని అటువంటివారిని దగ్గరకు తీసుకుని ఓదార్చడానికే నేను శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాను " అని
ఎంతటి అద్భుత విషయం. అవ్యాజకరుణామూర్తి స్వామి.
" యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) " అన్నారు పరమాత్మ గీతలో.
ఈ పవిత్రమయిన రోజున " నమఃశివాయ " అని జపం చేసుకుని స్వామి అనుగ్రహం పొందుదాం.
మహాశివరాత్రి శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీశివార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment