ఇంద్రియాలను నిగ్రహించుకోమనలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" రాగద్వేషవియుక్తైస్తు 

  విషయానింద్రియైశ్చరన్ !

  ఆత్మవశ్యైర్విధేయాత్మా 

  ప్రసాదమధిగచ్చతి "

             ‌ - భ.గీత 2:64

అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. 

కంచిపరమాచార్యులు అమ్మవారి పూజకు తీసుకుని వచ్చిన గులాబీలు అద్భుతంగా ఉన్నాయి అని మెచ్చుకుంటారు. ఎవరయినా అమ్మవారు కామాక్షీదేవి కీర్తన పాడితే విని ఆనందిస్తారు. భక్తురాలు ప్రసాదం చేసి పట్టుకువస్తే తిని చాలాబాగుంది అంటారు. అంటే ఆయన ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహిస్తున్నారు అని తెలుస్తూంది. కానీ అవేమీ ఆయనను మాయలో పడేయవు.

ఇక్కడ " మాయ " అంటే ఏవో రోగాలున్నా ఓ రసగుల్లా తినవచ్చు, కొత్తావకాయ కలుపుకుని 4 ముద్దలు తినవచ్చు. అంతేకాని మహారుచిగా ఉందని కొంచెం ఎక్కువ లాగిస్తే తరువాత బాధపడవలసినది తనే అనే ఎరుకలో ఉన్నవాడే సాధకుడు.

ఒకరకంగా మనతోబాటు ఎక్కువ మంది సాధకుల క్రిందే లెక్క. స్నేహితులలో ఎంతోమంది మద్యపానం చేసేవారున్నా కొందరు త్రాగరు. చుట్టూ ఎందరో సిగరెట్లు త్రాగేవారున్నా కొందరు కాల్చరు. మన కుటుంబసభ్యులేకాకుండా ఎందరో అమ్మాయిలు ఇంటినుంచి ఆఫీసుకి ఆఫీసునుంచి ఇంటికి టాక్సీలలో ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నారంటే చోదకులు సాధకులు అవడం కారణంగానే అనుకోవాలి.

పూజ్యులు గరికిపాటివారు ఈనాటి కొందరి అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ తరచూ చెబుతూంటారు. రోడ్డుమీద 20-25 ఏళ్ళ యువకుడు వెడుతుంటే ఓ అందమైన అమ్మాయి టీషర్టు వేసుకుని ఎదురుపడితే యువకుడు ఆ అమ్మాయిని చూస్తే తప్పులేదు. చూడకపోతేనే తప్పు, అబ్బాయిని డాక్టరుకి చూపించాలి ఓ సారి. ఇంద్రియాలు విషయాలను గ్రహించడం తప్పు కాదు. అది ఆ వయస్సు లక్షణం.‌ గ్రహించినా మాయలో పడకుండా నిగ్రహంలో ఉన్నవాడే నిజమయిన సాధకుడు.

అందుకని నోటిని, చెవులను, కళ్ళను కట్టి పడేసుకోనక్కరలేదు. వాటికి లొంగిపోయి బానిసలవకూడదు.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ