చట్టం కన్నా ధర్మమే గొప్పది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" చట్టం - ధర్మం "
" క్లైబ్యం మా స్మ గమః పార్ధ "
- భ.గీత 2:3
పరమాత్మ అర్జునుడికి ఏమీ చెప్పడం మొదలెట్టకుండానే " ముందు నపుంసకత్వం వదిలేయ్ " అన్నారు.
ఆయనే " ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే " అన్నారు. ఇక్కడ " యుగే యుగే " అంటే మళ్ళీ మళ్ళీ అని. యుగానికి ఒకసారి అని కాదు. ధర్మానికి హాని జరిగినప్పుడల్లా ఆయన వచ్చేయరు, ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉంటారు.
ధర్మం గురించి ప్రవచనంచేస్తూ పూజ్యులు సామవేదంవారు ఓ అద్భుతమయిన విషయం చెప్పారు. ఆయన ఒకటే చెప్పారు కాని 3 విషయాలు చూద్దాం.
ఒకాయన బస్ ఎక్కారు. ఆడువారిసీట్లు, వికలాంగులసీట్లు అని వ్రాసి వాటిలో కూర్చోడం నేరం, 500 రూ ఫైన్ అని వ్రాసి ఉంది. ఈయన వాటిని వదిలేసి కొద్దిగా వెనక కూర్చున్నారు. బస్ నిండిపోయింది. అప్పుడు ఒక 80 ఏళ్ల ముసలాయన లేక 7/8 నెలల గర్భిణీస్త్రీ వచ్చి ఆయన ప్రక్కన నుంచున్నారు. చట్టప్రకారం ఆయన లేవనక్కరలేదు. కాని ధర్మం ఏమి చెబుతూందంటే అటువంటి పరిస్థితుల్లో ఆయన లేచి వారికి సీటు ఇవ్వాలని, అలా చేస్తే అతనికి అతని కుటుంబానికి మేలు అని.
కార్ లో విజయవాడ వెడుతున్నారు ఫేమిలీతో. దారిలో రోడ్డు ప్రక్కన మోటార్ సైకిల్ పడిపోయి ప్రక్కన దంపతులు రక్తం ఓడుతూ పడి ఉన్నారు. మీరు ఆగి వారికి సహాయం చెయ్యకపోతే నేరమని చట్టంలో లేదు. కాని ధర్మం చెబుతూన్నది " అటువంటిసమయంలో వీలయిన సహాయం చెయ్యాలి " అని.
మీరు స్కూటర్ మీద వెడుతూంటే 4,5 కుక్కలు ఓ పిల్లవాడిని పీకేస్తున్నాయి. మీరు ఆగి పిల్లవాడిని రక్షించకపోతే నేరమని చట్టం చెప్పట్లేదు కాని ధర్మం సహాయం చేసి తీరాలంది. పైగా దూరంగా నుంచుని " ఉష్ ఉష్ " అంటే కుక్కలు పారిపోవు. 4 రాళ్ళు బలంగా వేసి వాటిని కొట్టాలి. అయ్యో జంతు హింస ( ఓ హీరో భార్య బాధపడుందేమో ) అని కూడా ఆలోచించనక్కరలేదు.
ధర్మమే ఉత్కృష్టమయినది అని అందుకే మన ఋషులు పదే పదే చెప్పారు. చట్టం ధర్మంలో ఒక భాగం మాత్రమే.
అటువంటి ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు ఖండించాలి, అది చట్టవ్యతిరేకమయినా.
అలా చేసి ఎందరో ప్రాణమానసంపదలు త్యాగం చెయ్యబట్టే ఈరోజు స్వేచ్ఛాయుతంగా వాదనలు చేసుకుంటున్నాం మనం.
" ధర్మో రక్షతి రక్షితః "
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment