అజ్ఞానం వదిలించుకునే ప్రయత్నం చేస్తూండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" తమో2పహా " - అమ్మవారి ఒక అత్యద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 361వ నామం. 

" తమః + అపహా " అంటే అజ్ఞానంని పోగొట్టునది.

ఇంతకీ అజ్ఞానం అంటే ఏమిటి?. 

తను ఎవరో అది తాను కాదనుకోవడం, తను ఏది కాదో అది తను అనుకోవడమే అజ్ఞానం. ఈ శరీరమే శాశ్వతం అనుకోవడం, దాని కోసమే జీవితాంతం పాటుపడడం. తనకోసమే కాకుండా తరువాత తరాలకు కూడా అశాశ్వతమైన సంపదలు కూడబెట్టడం. వాటికోసం చేయకూడని పనులన్నీ చేయడం.

చేయవలసిన పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం. సమస్యలలో కూరుకుపోవడం. జీవితాన్ని దుఃఖదాయకం చేసుకోవడం.

" తస్మాదజ్ఞానసంభూతం 

  హృత్స్థం జ్ఞానసినాత్మన: |

  ఛిత్త్వాయినం సందేహం 

  యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత " 

                 ‌‌- భ.గీత 4:42

" కాబట్టి, జ్ఞాన ఖడ్గంతో హృదయంలో తలెత్తిన సందేహాలను ఛేదించు . ఓ భారతా కర్మయోగంలో స్థిరపడి, యుద్ధము చేయుటకు లే " అన్నారు పరమాత్మ అర్జునుడితో. ఏది చేయాలో అది చెయ్యి. సందేహించకు అన్నారు.

ఆశ్చర్యం ఏమిటంటే అప్పుడప్పుడు కొన్ని సత్యాలు అనుకోకుండా బయటకు వచ్చేస్తూంటాయి. కొందరు నాయకులు " ఆత్మప్రబోధానుసారం " ఓటు వెయ్యండి అంటూంటారు. అంటే మనిషి లోపల పవిత్రమైన ఆత్మ ఒకటి ఉందని అందరికీ తెలుసు. కాని దాని ఉన్నతి కోసం ఎవరూ ప్రయత్నించరు. అదే అజ్ఞానం.

త్యాగయ్య " పరహింస పరభామాన్యధన పరమానవాపవాద పరజీవనాదుల కనృతమే భాషించెదరయ్య త్యాగరాజనుత - ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంత దాసులె " అని కీర్తించారు.

ఈ విషయాలనుంచి బయటపడాలంటే అమ్మవారి మీద అచంచలమైన భక్తి ఒక్కటే మార్గం.

" శివానుగ్రహదేవా ముముక్షుర్వై శరణమహంప్రపద్యే " - " ఈశ్వరానుగ్రహం పొందాలంటే భక్తియే మార్గం " అని ఉపనిషత్తులు తెలియచేస్తున్నాయి. 

భక్తి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానం పోతే అంతా సచ్చిదానందమే ( సత్ + చిత్ + ఆనందం ) కదా. 

అందరం అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ