ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గించుకోవాలి, అంతర్ముఖులవాలి, ముక్తి కోసం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అంతర్ముఖసమారాధ్యా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 870వ నామం.

" అంతర్ముఖసమారాధ్యా "అంటే అంతర్ముఖులచే ఆరాధింపదగినది అని.

సమారాధన అంటే శాస్త్రయుక్తంగా ఆరాధించడం. శాస్త్రయుక్తంగా శ్రద్ధగా " రాజశ్యామలయాగం " చేస్తే చక్రవర్తిని చేస్తుంది అమ్మవారు అని చెబుతూంది వేదం. కాని నేడు అశాశ్వతమయిన చిన్న చిన్న పదవులకోసం ఆర్భాటంగా ఈ యాగం చేసేస్తున్నారు అందరూ.

ఈ విషయమే గీతలో పరమాత్మ తెలియచేసారు: 

" యామిమాం పుష్పితాం 

  వాచం ప్రవదన్త్యవిపశ్చితః,

  వేదవాదరతాః పార్థ 

  నాన్యదస్తీతి వాదినః "

             -  భ.గీత 2:42

" పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులవుతారు " అన్నారు పరమాత్మ.

కఠోపనిషత్తు ఏమి చెబుతూందంటే " అమ్మవారు బ్రొటకనవేలు ప్రమాణంలో అందరి హృదయాలలోనూ ఉంటారు " అని. ఎందుకు మనలోనే ఉండడం అంటే ఎప్పటికయినా సత్యం తెలుసుకుని లోపలికి ప్రయాణం ప్రారంభించి అంతర్ముఖులు అవుతారు అని. ఎక్కడో దూరంగా ఉంటే బద్ధకిస్తారేమోనని మనలోనే ఉండి అనుగ్రహించడానికని ఎదురు చూస్తూ ఉంటారు అమ్మవారు. అవ్యాజకరుణామూర్తి.

" ధీరులు నిరపేక్షులు 

  నాత్మారాములునైన   

  మునులు 

  హరిభజనము నిష్కారణమ 

  చేయుచుందురు

  నారాయణుఁ డట్టివాఁడు 

  నవ్య చరిత్రా‌ " 

             - పోతనభాగవతం.

ఇటువంటి అంతర్ముఖులకు ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండదు. వారి ఆత్మలతో రమిస్తూ/ఆటాడుకుంటూ ఉంటారు. త్యాగయ్య 96 కోట్ల రామనామం చేసారంటే ఆయనకు వేరే ధ్యాస ఏమీ ఉండదు. ఇటువంటి వారినే అమ్మవారు అనుగ్రహిస్తారు.

అన్నమయ్య " మొదలుండ కొనలకు మోచి నీళ్ళు పోయనేల, ఎదలో నీవుండ ఇతరములేల " అంటారు.

ఒక్కసారి అంతర్ముఖులవుతే అశాశ్వతమయిన ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది, మాయ తొలగి జీవితం ఆనందదాయకమవుతుంది.

" యత్ ఫలం నాస్తి తపసా 

  న యోగేన సమాధినా 

  తత్ ఫలం లభతే 

  సంయక్ కలౌ కేశవ కీర్తనాత్"

మిగతా యుగాలలో తపస్సు, యోగం, సమాధితో ఏ ఫలం వస్తుందో ఆ ఫలం కలియుగంలో కేవలం కేశవనామ స్మరణతో లభిస్తుంది అని భాగవతం తెలియచేస్తూంది.

అలా స్మరణ చేయడం కూడా అంత సులభం కాకపోయినా ప్రయత్నం చేస్తూ ఉండడం మంచిదే. అమ్మవారి నామస్మరణ చేసుకుని తరిద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ