భౌతిక సుఖాలను అతిగా ఇష్టపడకూడదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బహిర్ముఖసుదుర్లభా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 871వ నామం.
" బహిర్ముఖసుదుర్లభా " అంటే విషయములందు ఆసక్తి కలవారికి అమ్మవారు దుర్లభురాలు. విషయములు అంటే బాహ్య/ప్రాపంచిక విషయాలు. నామంలో దుర్లభా అంటే చాలు కదా. సుదుర్లభా అనడం దేనికి?. అంటే అట్టి విషయాసక్తి ఉన్నవారికి ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మవారి అనుగ్రహం లభించదు అని.
అలా విషయాల పట్ల ఆసక్తులవడం జీవుల తప్పు కాదు. అవి అంత ఆకర్షణీయంగా, మాయచేస్తూ ఉంటాయి.
ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో చెబుతారు:
" భోగైశ్వర్యప్రసక్తానాం
తయాపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిః
సమాధౌ న విధీయతే "
- భ.గీత 2:44
" ప్రాపంచిక భోగాలు, సుఖాలు, లౌకిక సంపదల పట్ల ఆకర్షితులయినవారి మనస్సులో భగవంతుని పట్ల భక్తిభావం కలుగనే కలుగదు " అంటారు పరమాత్మ.
గరుడపురాణంలో ఓ అద్భుత శ్లోకం ఉంది:
" చక్రధరో2పి సురత్వం
సురత్వలాభే
సకలసురపతిత్వం
భవతిరుం
సురపతిరూర్ధ్వగతిత్వం
తథాపి ననివర్తితే తృష్ణ "
" రాజు చక్రవర్తి అవాలనుకుంటాడు. చక్రవర్తి ఇంద్రుడు అవాలనుకుంటాడు. ఇంద్రుడు బ్రహ్మ అవాలనుకుంటాడు. కోరికకు అంతు లేదు " అని. ఇలా కోరికలు గుర్రాలులా పరిగెట్టడంలో అందరూ ఒకటే.
కాని కోరికలు మరీ అధర్మబద్ధంగా లేకుండా ఉండేలా సాధనచేస్తూ ఉంటే అమ్మవారు అనుగ్రహించడానికి అవకాశం ఉంది. అవ్యాజకరుణామూర్తి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment