సగుణ నిర్గుణ రూపం అమ్మవారిది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏

" దక్షిణామూర్తిరూపిణీ, సనకాది సమారాధ్యా " - అమ్మవారి అద్భుతనామాలు. శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 725, 726 నామాలు.

దక్షిణామూర్తి ని ఆదిగురువుగా పూజిస్తాం. మరి మళ్ళీ అమ్మవారి నామం " దక్షిణామూర్తిరూపిణీ " ఏమిటీ అని ఆశ్చర్యం కలుగుతుంది.

దక్షిణ + అమూర్తి అంటే సగుణం+నిర్గుణం. రెండూ కలిసిన స్వరూపం. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు భక్తితో సేవిస్తే. స్వామి, అమ్మవారు వేరుకాదు, అర్ధనారీశ్వర రూపం. దక్షిణామూర్తి రూపిణిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణామూర్తి రూపం శివశక్తి స్వరూపం, కుడిచెవికి మకరకుండలం ( మగవారు ధరించేది ), ఎడమచెవికి తాటంకం ( ఆడువారు ధరించేది ) ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే. 

" సనకాది సమారాధ్యా " ఇంకొక అద్భుతనామం. సనకాదులచే సంపూర్ణంగా ఆరాధించబడినది అని అర్ధం. అమ్మవారి నామాల్లో స్మరింపబడుతున్నారంటేనే తెలుస్తూంది వీరి గొప్పదనం. వారు నలుగురు పిల్లలు - సనక, సనాతన, సనందన, సనత్కుమారులు. ఇప్పుడు మనం " బాలమేధావులు " అంటూంటాం. ఈపదానికి ఆద్యులు వీరు. 4వ ఏటే అన్నివేదాలు చదువుకున్నవారు. బ్రహ్మ సృష్టికోసం వీరిని పుట్టిస్తే వీరు ఆధ్యాత్మికంగా ఉండి తండ్రి మాటను వినలేదు. అప్పుడు బ్రహ్మ మనువులను పుట్టించారు సృష్టికోసం.

ఈ సనకసనందనాదులు జ్ఞానసముపార్జనకై కైలాసానికి వెళ్ళారు ఓ రోజు. అక్కడ శివపార్వతులు నాట్యం చేస్తున్నారు, ప్రమధగణాలు ఆనందంతో తిలకిస్తున్నారు. ఇలా భార్యతో కూడి నాట్యాలు చేసే ఆయన జ్ఞానాన్ని ఏమి ఇస్తాడు అని తలచి వీరు తిరిగి వెళ్ళిపోతారు. 

వీరు అసంతృప్తితో తిరిగి వెడుతూంటే దారిలో పెద్ద మర్రిచెట్టు క్రింద ఓ పిల్లాడు కూర్చుని ఉంటే ఆయన ముందర పెద్దవయస్సు వారైన ఎందరో ఋషులు కూర్చుని ఉంటారు. ఆశ్చర్యంతో వీరు దగ్గరకు వెళ్ళడం, ఆ పిల్లవాడి చిరునవ్వు చూడడంతోనే వీరికి సంపూర్ణ జ్ఞానోదయం అవడం జరిగింది. ఆ పిల్లవాడి కుడిచెవికి మకరకుండలం ఎడమచెవికి తాటంకం ఉండడం గమనించి ఆయనే " గురు " దక్షిణామూర్తిగా గ్రహించి ఆయన్ని సేవించుకుని ధన్యులయ్యారు. 

అంతటి మహానుభావులు కనుకే అమ్మవారి నామాల్లో స్థానాన్ని పొందారు.

" శ్రీదక్షిణామూర్తిరూపిణి " ఆశీస్సులు అందరికీ పుష్కలంగా కలగాలని కోరుకుందాం.

ఏతత్ ఫలం సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ