మాట మృదువుగా మధురంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" కలాలాపా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 328వ నామం. 

" కలాలాపా " అంటే " మధురమయిన భాషణములు చేయునది " అని. అంటే అమ్మవారి మాటలు అతిమధురంగా ఉంటాయని.

శ్రీలలితా అష్టోత్తరశతనామావళి పూజలో అమ్మవారిని " శ్రీకలభాషిణ్యైనమః అని పూజిస్తాం.

శంకరాచార్య విరచితమైన సౌందర్యలహరి లో ఓ అద్భుతమైన శ్లోకం :

" విపంచ్యా గాయంతీ వివిధ మపదానం పశుపతేః, 

  త్వయారబ్దే వక్తుం చలిత శిరసా సాధువచనే | 

  తదీయై ర్మాధుర్యై రవలపిత తంత్రీ కలరవాం , 

  నిజాంవీణాం వాణీ  నిచుళయతి చోళేన నిభృతం ||" 

మణిద్వీపం లో సింహాసనం మీద అమ్మవారు కూర్చుని ఉన్నారు - దేవతలందరూ కొలువుదీరి ఉన్నారు. చదువుల తల్లి సరస్వతి ఆ పరమేశ్వరుణ్ణి పొగుడుతూ అద్భుతంగా వీణావాదన చేస్తూంది - అమ్మవారు బుద్ధిపూర్వకంగానో అప్రయత్నంగానో " ఆహా ఓహో " అంటూందిట. ఆవిడ మాటలు ఎంత మధురాతి మధురం గా ఉన్నాయంటే శ్రీవాణి తన వీణానాదాన్ని ఆపేసి వీణ మీద తన చీర కొంగు కప్పేసిందిట.( దేవతలు ఎవరూ తన వీణావాదనం వినటం లేదని , అమ్మవారి మధురమైన పలుకులనే వింటున్నారని భావం ).

అంటే దేవతలందరూ మధురం గా ఉన్న అమ్మవారి మాటలే వింటూండడం వల్ల వాణి తన వీణ ని ఆపేసిందన్నమాట. ఇందులో ఉన్న భావం చూద్దాం - పిల్లలకి ( ఇక్కడ దేవతలు) మొదటగా విన్నది , అతి ఇష్టమైనది తల్లి గాత్రమే . తల్లి , పిల్లాడు ఓ కచేరీ కి వెళ్ళారనుకుందాం - ఎం ఎస్ , బాలమురళి ఎవరిదైనా - వాళ్ళ పాటలకన్నా ప్రక్కవాళ్ళతో అమ్మ చెప్పే మాటలనే - ఇతరులకి మాటల్లా ఉంటాయి కాని పిల్లాడికి అదే అద్భుతమైన పాటలా ఉంటుంది - వింటూ ఆనందిస్తాడు . పిల్లలకి అమ్మ గొంతు కి మించిన అద్భుతమైన గాత్రం లేదు - పిల్లలకి తన తల్లి మాటకి మించిన శ్రావ్యమైన పాట ఉండదని భావం - దాన్నే వింటూ ఆనందిస్తూ ఉంటారు - ఎంత అద్భుతమైన అంతర్లీనమైన భావం పై శ్లోకం లో. అందుకే శంకరులు 1200 ఏళ్ళు పైగా గడిచిపోయినా మన హృదయాల్లో ఇప్పటికీ ఇలా నిలచిపోయారు. 

అమ్మవారిని అందరికీ సకలశుభాలను కలిగించమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ