అప్రియమయినా మంచిచేసే సలహాలనే ఇస్తూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అందాల రాముడు 

‌  ఎందువలన దేముడు "

" సులభాః పురుషారాజన్

  సతతం ప్రియవాదినః

  అప్రియస్య ప్రత్యస్య 

  వక్తా శ్రోతాచ దుర్లభాః "

" రాజా - తీపిమాటలు చెప్పేవారే సులభంగా దొరుకుతారు కాని అప్రియమయినా మంచిమాట చెప్పేవారు దొరకడం కష్టమే " - ఈ మాటలు అన్నది మారీచుడు రావణుడితో.

" తపస్సులోగాని బలంలోగాని సంపదలోగాని విక్రమంలోగాని తేజస్సులోగాని కీర్తిలోగాని నాతో సరితూగుతాడా రాముడు " అంటాడు రావణుడు సీతతో అశోకవనంలో హనుమ చెట్టుపై నుంచి చూస్తూన్నప్పుడు. మరి అటువంటి తపశ్శాలి " కపటసన్యాసి " వేషంలో ఎందుకు వెళ్ళి సీతమ్మను అపహరించడం.

రాముడు 14000 మంది ఖరదూషణాది రాక్షసులను 3 ఘడియలలో ( 72 ని.లలో ) సంహరించడం చూసిన అకంపనుడు అనే రావణదూత లంకనుచేరి రావణుడికి విషయం తెలియచేస్తాడు. " వెంటనే వెళ్ళి రాముడిని చంపేస్తాను " అని రావణుడు అంటే అకంపనుడు అంటాడు " అది అంత సులభం కాదు. అతను ధర్మమూర్తి ( అంటే మనం ధర్మపరులం కాదు, పాపులం కదా అని ), విశ్వంలోని గ్రహామండలాలను కల్లోలపరచగలడు, సముద్రాలను ఇంకింపచేయగలడు. అంతెందుకు రాముడు సర్వసృష్టిని ఉపసంహరించి పునస్సృష్టి చేయగలడు. పాపులు ఎలా స్వర్గం చేరలేరో అలా మనం రాముడిని జయించలేం " అని. అంటే రాముడు " సృష్టి స్థితి లయ " కారకుడయిన విష్ణువే అని తెలియచేసాడు. 

" నీకు కక్ష తీర్చుకోవాలని ఉంటే అతను లేని సమయంలో అతని అందమయిన భార్యను అపహరించు " అని సలహా ఇచ్చాడు అకంపనుడు.

అప్పుడు రావణుడు మారీచుడు దగ్గరికి వెళ్ళి సీతాపహరణానికి సహాయం చేయమని అడుగుతాడు. 

అప్పుడు మారీచుడు " ఇటువంటి చచ్చు సలహా నీకు ఎవరు ఇచ్చారు, నీకు మంచి చేసే సలహా ఇచ్చేవారే లేరా? " అని అడిగి " అప్రియమయినదయినా రాజుకు మంచి చేసే సలహా ఇచ్చే సలహాదారులు దొరకడం కష్టమే " అని అంటాడు.

" సలహాదారులు " ఎటువంటి వారో, ఎలాంటి సలహాలు ఇస్తారో వేల సంవత్సరాల క్రితమే మహర్షి చెప్పేసారు.

అదీ రామాయణం గొప్పదనం. సనాతనధర్మం ఉత్కృష్టత.

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.

" అందాల రాముడు 

‌  అందువలన దేముడు "

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ