శ్రీరామ నవమి, శ్రీరాముని పుట్టిన రోజు నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏

" అందాలరాముడు, 

  ఎందువలన దేముడు " 

రాముడు ఎందుకు దేవుడయాడు. రాక్షసుడి చేతకూడా " రామో విగ్రహవాన్ ధర్మః " అని ఎందుకు కీర్తింపబడ్డాడు.

చాలామంది అంటూంటారు " రాముడు తండ్రిమాట జవదాటడు " అని. కాని అది సరికాదు, ఆయన ధర్మానికే కట్టుబడ్డాడు.

అరణ్యవాసానికి బయలుదేరుతూ తల్లి కౌసల్య దగ్గరకు వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించి అనుమతి కోరుతాడు. ఆవిడ అంటుంది - తండ్రిమాటకు కట్టుబడి అడవికి వెడుతున్నావు బావుంది కాని తల్లిమాటకు కూడా నువ్వు అదే విలువనివ్వాలి కదా. నేను కోరుతున్నాను " అడవికి వెళ్ళకు, రాజ్యాన్ని స్వీకరించు " అని.

రాముడు అంటాడు " అమ్మా నేను తండ్రి మాటకోసం అడవికి వెళ్ళటం లేదు. తండ్రి ఒకరికి మాట ఇచ్చారు, నేను అడవికి వెళ్ళకపోతే ఆయనకు అసత్యదోషం అంటుకుంది. అసత్యదోషం చాలా భయంకరమైనది. మహర్షులుకూడా ఒక్క చిన్న అసత్యమాడితే వారి తేజస్సు హరించుకుపోతుంది. అందుకే ఋషులు తెలిసో తెలియకో ఎప్పుడయినా అసత్యమాడి ఉండవచ్చు అని తలచి ఆ అసత్యదోషనివారణ కోసం సరస్వతీవ్రతం, ' సారస్వతేష్టి ' యజ్ఞం చేస్తారు. మరి నాతండ్రికి అసత్యదోషం కలగకుండా చూసే ధర్మం/బాధ్యత నాదే కదా " అని.

" ఓహో అలాగా " అని కౌసల్య వదిలేయలేదు. " అయితే నన్నుకూడా నీతో తీసుకునివెళ్ళు. నన్ను తీసుకెళ్ళకూడదని నిబంధనేమీ లేదుకదా " అంది. రాముడు అన్నారు " ఏ స్త్రీకయినా భర్తే ముఖ్యం, ఆ తరువాతే కొడుకయినా, ఎవరయినా అని శాస్త్రాలు చెబుతున్నాయి. నీభర్త మహారాజు. ఆయన ధర్మం తప్పుతే రాజ్యానికి ప్రజలకీ క్షేమం కాదు. ఆయన ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో నువ్వు ప్రక్కన ఉండి ఆయన ధర్మాన్ని విస్మరించకుండా చూడవలసిన ధర్మం/బాధ్యత నీదేనమ్మా " అని.

అప్పుడు కౌసల్య అంటుంది " నశక్యతే వారయితుం గచ్ఛేదానిం రఘోత్తమా " అని. అంటే " నిన్ను ఆపడం కష్టం, వెళ్ళిరా " అని. అంతగా తల్లిని కూడా ఒప్పించి మరీ అరణ్యవాసానికి వెళ్ళాడు శ్రీరాముడు.

రాముడు ఎప్పుడూ ఇది నా అభిప్రాయం అని అనలేదు. ఇది " ఋషిప్రోక్తం, శాస్త్రప్రోక్తం " అనేవారు. అంటే ఋషులు ఇలా చెప్పారు, శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి కనుక అలా చేద్దాం అనేవారు.

అందుకే ఆయన పూజనీయుడు, దేవుడు అయారు.

చిన్నతనము నుంచీ పాఠ్యాంశాల్లో రామాయణాన్ని చేర్చి చదివిస్తే బాధ్యత ( ధర్మం ) గలిగిన పౌరులుగా తీర్చిదిద్దబడుతారు పిల్లలు. సంశయం నాస్తి.

" అందాల రాముడు

  అందువలన దేముడు ".

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ