రామాయణం ఎందుకు అంత అద్భుత గ్రంధం అయింది - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీరస్తు శుభమస్తు"🙏
" అందాల రాముడు
ఎందువలన దేముడు "
చిన్నప్పటినుంచే ఉత్కృష్టమయిన రామాయణ, మహాభారతాలను పాఠశాలల్లో చదివిస్తే ధార్మికజీవనం అలవాటవుతుంది పిల్లలకి. అది జరగకుండా చేసారు అందరూ కలిసి.
ఒకావిడేమో " రామాయణ విషవృక్షం " అని వ్రాసుకొచ్చింది. కొందరేమో రాముడికి ఇక్కడ పనేమిటి, వచ్చి మరీ ఇక్కడి జనాలని చంపడమేమిటి అని వాదన.
24వేల శ్లోకాల రామాయణంలో, 100700 శ్లోకాల భారతంలో ఉన్న అద్భుత విజ్ఞానాన్ని, సంస్కృతిని మాత్రం ఎవరికీ తెలియకుండా అన్ని కుప్రయత్నాలు చేసారు/చేస్తున్నారు.
భరతుడు వచ్చి వెళ్ళాక ఆ జ్ఞాపకాలనుంచి జనాలతాకిడినుంచి తప్పించుకోవడానికని అక్కడనుంచి అత్రిముని ఆశ్రమానికి అక్కడనుంచి శరభంగముని, సుతీక్షణముని ఆశ్రమాలకి వెడతారు సీతారామలక్ష్మణులు. మునులందరూ తమ తపశ్శక్తి ధారపోస్తాం, రాక్షసులు బాధపెడుతున్నారు, రక్షించమని కోరతారు. " మాశక్తులు మేము సంపాదించుకునేలా ఆశీర్వదించండి చాలు. రాక్షసుల విషయం మేము చూసుకుంటాం " అంటాడు రాముడు.
అక్కడనుంచి వీరు బయలుదేరి వెడుతూంటే సీతమ్మతల్లి అంటుంది రాముడితో - " ఎంత జాగ్రత్తగా ఉన్నా అధర్మం ఏదో ఒక సందుచూసుకుని మనిషిలో ప్రవేశిస్తుంది. దానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి అసత్యమాడడం, పరదారాభిగమనం ( దారా అంటే భార్య. పరుల భార్యలపై మనసు పడడం అని అర్ధం ), వైరంలేని యుద్ధం. మొదటి రెండు మిమ్మల్ని దరిచేరవు కాని 3వది మనకు అవసరమా. రాక్షసులతో మనకు వైరంలేదు. వనవసానికి వచ్చాం, గుట్టుగా పూర్తిచేసుకోక ఎందుకివన్నీ. ఆయుధాలే మనకు అవసరంలేదు కదా " అని అంటుంది.
రామాయణం పూర్తిగా చదువుతే కుహనామేధావుల ప్రశ్నలకి జవాబులు కూడా అక్కడే దొరుకుతాయి.
రాముడు అంటాడు " జానకీ నువ్వు చెప్పింది నిజమే కాని ఈ మునులు వారి అభ్యున్నతికోసం, లోకకళ్యాణం కోసం యజ్ఞయాగాలు, తపస్సు చేసుకుంటున్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టడంలేదు కదా. మరి రాక్షసులు వీరిని ఇబ్బందిపెట్టడం, చంపడం ధర్మమా. దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించడం రాజధర్మమే కదా. మునులు తమని రక్షించమని అడుగుతూంటే కాదనడం అధర్మం కాదా " అని.
ఎంత అద్భుత విషయం. వేల సంవత్సరాల తరువాతైనా కొందరు కుహనామేధావులు " దండకారణ్యం వెళ్ళి రాముడు అక్కడున్న రాక్షసులని చంపడం న్యాయమా " అని అడగవచ్చు అని ఊహించి ఎంత చక్కటి వివరణ ఇచ్చారు మహర్షి.
సీతమ్మ రామయ్యల ఔన్నత్యం ఒకదానితో ఒకటి పోటీపడుతూన్నట్లు అనిపిస్తూంది కదా.
అదీ మన సనాతనధర్మం ఉత్కృష్టత.
" అందాల రాముడు
అందువలన దేముడు "
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment