గోవిందా గోవిందా అనుకుంటే చాలా కలికాలంలో - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" గోవిందరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 267వ నామం.

ఈనామానికి " విష్ణుస్వరూపురాలు " అని భాష్యం చెప్పారు భాస్కరరాయలు. ఇద్దరికీ తేడా ఏముంది. ఆయన నారాయణ, అమ్మవారు నారాయణి. 

గోవుకు ఉన్న నానార్ధాలలో భూమి ఒకటి. వరాహావతారంతో భూదేవిని వరాహమూర్తి రక్షించడం వలన స్వామికి గోవింద అనే నామం వచ్చిందని కూడా చెబుతారు పండితులు.

విష్ణుసహస్రనామాలలో " గోవిందో గోవిదాంపతిః " అని పారాయణ చేస్తాం. శంకరులు ఈ నామానికి " గోవిందః అంటే గోవులను రక్షించువాడు " అని భాష్యం వ్రాసారు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులను, గోవులను రక్షించినప్పుడు ఇంద్రుడు, కామధేనువు " గోవిందా " అని కీర్తించారు కృష్ణుడిని.

శంకరులు ఓసారి కాశీలో ఉన్నప్పుడు ఓ వృద్ధుడు " వ్యాకరణ సూత్రాలు " వల్లెవేయడం చూసి ఆశ్చర్యపోయి " ఓ మందమతీ మరణానికి చేరువయిన నీకు మరణసమయంలో ఈ వ్యాకరణసూత్రాలు ముక్తిని ఇవ్వవు. గోవిందనామ స్మరణచేసుకుని తరించు " అని చెబుతూ అద్భుతమయిన జీవితార్ధాన్ని తెలియచేసే " భజగోవిందం ( మోహముద్గరం )" ని అనుగ్రహించారు.

" కలౌ భక్తిః కలౌ భక్తిః 

 ‌ భక్త్యా కృష్ణం పురస్థితః " 

అన్నారు వ్యాసర్షి భాగవతంలో. కలియుగంలో భక్తియే, కేవలం భక్తియే కావాలి, భక్తిలో కృష్ణుడు కొలువయి ఉంటాడు అని తెలుసుకోవాలి.

" కలౌ వేంకట నాయక " అని తెలియచేస్తారు. అంటే కలియుగానికి వేంకటాచలపతి నాయకుడు. ఆయనను గోవిందా అని కొలుస్తారు. విష్ణుధామాలన్నీ గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి ఎల్లవేళలా.

గోవిందనామం అందరికీ చిరపరిచితం. సామాన్యుడు కూడా రోజూ కొన్ని సార్లయినా గోవింద నామస్మరణ చేస్తూంటాడు.

ఆర్తితో గోవిందా అని స్మరిస్తూ ఉంటే చాలు అన్నీ అమ్మవారే చూసుకుంటారు. నాస్తి సంశయం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ