కృష్ణపరమాత్మ శుభలక్షణములు ఏమి? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" సత్యం శౌచం దయా శాంతిః త్యాగస్సంతోషాద్యవం
శమోదమస్తపస్సౌమ్యం ఇతిక్షోపరతిశ్శృతం జ్ఞానం
విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతిః
స్వాతంత్ర్యం కౌశలం కాంతిః ధైర్యం
మార్దవమేవచ ప్రాగల్భ్యం ప్రశ్రయశ్శీలం
సహః ఓజో బలం భగః గాంభీర్యం స్థైర్యమార్తిక్యం
కీర్తిర్మానోనహంకృతిః ఏతేచ అన్యే "
ఇవి కృష్ణపరమాత్మ శుభలక్షణములు.
పరీక్షత్ మహారాజు జనరంజకంగా ధర్మపాలన చేస్తున్నారు. కలి ప్రభావం వలన అధర్మం పెరుగుతూంది. అన్యాయాన్ని, అధర్మాన్ని నిర్మూలించడం రాజు పని. అందుకని ఆయన సంచారం చేస్తూ అధర్మాన్ని నిగ్రహిస్తున్నారు.
ఓ ప్రదేశంలో ఓ గోవు ఏడుస్తూంటే ఓ వృషభం కుంటుతూ వచ్చి ఓదారుస్తూంది. ఎంత అద్భుత సన్నివేశం.
ఆ గోవు భూమి. ఆ వృషభం ధర్మం.
ధర్మం అడుగుతూంది " కలి ప్రవేశిస్తూందనా, దుష్టులు పాలకులవుతున్నారనా, రాబోయే చెడుదినాలను తలచుకునా, ప్రకృతి అంతా నిస్సారమవుతుందనా లేక నిన్నటివరకూ తిరుగాడిన కృష్ణపరమాత్మ తన పాదాన్ని నీపైనుంచి తీసేసినందుకా, దేనికని బాధపడుతున్నావు తల్లీ " అని.
ఇక్కడ అద్భుతమయిన విషయమేమిటంటే వృషభం ( ధర్మం ) తన " తపస్సు, శౌచం, దయ " అనే 3 కాళ్ళు చచ్చు పడిపోగా " సత్యం " అనే 4 వ కాలుతో కుంటుతూ నడుస్తూంది - కలి ప్రభావం.
అప్పుడు గోవు అంటుంది " నువ్వు చెప్పిన ఈ అవలక్షణాలన్నీ పరమాత్మ పాదం తీసేయడం వలననే కదా. ఆయన లీలలు అన్నీ నేను ( భూమిగా, గోవుగా ) స్వయంగా చూసి తరించాను " అని చెబుతూ ఆయన శుభలక్షణములను పైవిధంగా తెలియచేస్తుంది.
ఇక్కడ 39 లక్షణములను చెబుతూ చివరలో " ఏతేచ అన్యే " అంది గోవు - అంటే " ఇంకా చాలా ఉన్నాయి " అని.
వీటిలో చాలా పదాలకు ( 1,3,4,5,6,10,16, 18,19,20,22,23,24,25,29,32,34,35,37,38 ) అర్ధాలు తెలిసినా కొన్ని అద్భుతమైన క్రొత్తపదాలు ఉన్నాయి. వాటి అర్ధాలు తెలుసుకుందాం:
2. శౌచం - బహిర్శుద్ధి, అంతర్శుద్ధి - రెండూ
ముఖ్యమే. మనతో బాటు సమాజం కూడా
ఆరోగ్యంగా ఉంటేనే జీవితం
ఆనందదాయకంగా ఉంటుంది.
7. ఆద్యవం - నిష్కపటం, ఋజుస్వభావం.
మనసా వాచా కర్మణా ఒకటే చేయడం.
8. శమం - అంతరేంద్రియ నిగ్రహం
9. దమం - బహిరేంద్రియ నిగ్రహం
11.సామ్యం - సమబుద్ధి
12.ఇతిక్ష - కష్టసహిష్ణుత, క్షమ
13.ఉపరతిః - వ్యవహారిక విషయాలనుంచి
తనను తాను మరల్చుకోవడం
14.శృతం - బహుశాస్త్ర ( పుస్తక) జ్ఞానం
15.జ్ఞానం - బ్రహ్మజ్ఞానం
17.ఐశ్వర్యం - ఈశ్వరభావం
21.స్మృతిః - స్మరణ, తానేమిటో మరచి
పోకుండా ఉండడం
26.మార్దవం - మృదుత్వం
27.ప్రాగల్భ్యం - మిక్కిలి ప్రతిభ
28.ప్రశ్రయః - వినయం
30.సహః - సాహసం, సహనం, తట్టుకోగలగడం
31.ఓజః - ఉత్సాహం, సమస్త భువనాలను
భరించగలిగే బలం
33.భగః - సౌభాగ్యం
35.ఆర్తిక్యం - శాస్త్రవాక్యములందు
అచంచలమైన శ్రద్ధ
39.అనహంకృతిః - అహంకారం లేకపోవడం
అటువంటి అద్భుతమైన శుభలక్షణములు కలిగిన పరమాత్మ నడయాడిన నేల మనది. దాని పవిత్రతను కాపాడుకునే బాధ్యత మనదే.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment