చైత్ర శుద్ధ పాడ్యమే సంవత్సరాది ఎలా అయింది? - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
నేడు ఉగాది. శ్రీ క్రోధి నామసంవత్సరం ప్రారంభం. క్రోధి అంటే క్రోధమును కలవాడు. అంటే కోపమును కలిగించేది అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు. కొంచెం జాగరూకతతో ఉండాలి ఈ సంవత్సరం.
అసలు చైత్రపాడ్యమినే ఉగాదిగా ఎందుకు జరుపుకోవాలో పూజ్యులు సామవేదంవారు ప్రవచనం చేస్తూ ఇలా తెలియచేసారు.
దిలీపచక్రవర్తి తన భార్య సులక్షణాదేవి తో కలిసి రధంపై " సంతానాన్ని పొందడానికి ఏమి చేయాలో " తెలుసుకోవడానికి వశిష్టాశ్రమానికి బయలుదేరారుట.
కాళిదాసు తన రఘువంశ కావ్యంలో ఈ ఘట్టాన్ని ఇలా వర్ణించారు " మంచుతొలగిన చైత్రపూర్ణిమనాడు చిత్ర నక్షత్రం చంద్రుడు కలిసిఉన్నట్లుగా ఉన్నారు రాణి రాజు " అని.
ఇక్కడ మంచుతెరలు తొలగిన అంటే బాధలు ( సంతానలేమి ) పోయే సమయం అని. ఎంత అద్భుతవర్ణన.
యజుర్వేదంలో ఇలా ఉంది:
" యజ్ఞపతిం వృషయేవ సాహుః,
ప్రజానిర్భక్తా అనుతప్త్యమానా,
మదభ్యౌస్తోతా2వపతౌ నరాధ "
దీని అర్ధం " అర్హత కలిగి శాస్త్రాలు తెలిసిన సోమయాజులు మధుమాసాలలో యజ్ఞాలు చెయ్యకపోతే కరువుకాటకాలు వస్తాయి " అని. ఎంత అద్భుత విషయం తెలియచేసారు మన ఋషులు.
యజ్ఞం చెయ్యడం ప్రకృతిలోని లోపాలను సరిచేయడానికి. కాలక్షేపానికి కాదు. సోమయాజులు " నాకు కుదరదు, ఖాళీలేదు, రాలేను " అని చెప్పకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
మరి ఈ " మధుమాసాలు " అంటే ఏమిటి.
వేదంలో ఒక మంత్రం ఇలా ఉంది:
" చిత్రా పౌర్ణమాసే దీక్షేరముఖంవా,
ఏతత్ సంవత్సరస్యాయ చిత్రా,
పౌర్ణమాసౌ ముఖస ఏవ,
సంవత్సరమారభ్య దీక్షంతే "
అంటే " సంవత్సరానికి ముఖం ( ముఖద్వారం ) అయిన చైత్రపౌర్ణమి నాడు దీక్ష ప్రారంభించాలి " అని.
అంటే సంవత్సరానికి చైత్రం మొదటి మాసం అని తెలుస్తూంది వేదముఖంగా.
అందుకే చైత్రపాడ్యమిని సంవత్సరం మొదటిరోజుగా " ఉగాది " గా జరుపుకుంటున్నాం వేల సంవత్సరాలుగా.
అంత సంశయరహితంగా తెలియచేస్తుంది మన " సనాతనధర్మము ", దానికి సాటి లేదు, రాబోదు.
క్రోధి నామ సంవత్సరం అందరికీ శుభమే కలిగించేలా అనుగ్రహించమని " అవ్యాజకరుణామూర్తి " అమ్మవారిని వేడుకుందాం.
సర్వే జనాః సుఖినోభవంతు.
సమస్త సన్మంగళాని సంతు.
అందరికీ క్రోధి నామ నూతన తెలుగుసంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment