మహాపతివ్రత తార ఎవరు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
అహల్యా..... - 4వ భాగం
" అహల్యా ద్రౌపదీ సీతా
తారా మండోదరీ తధా
పంచకన్యాం స్మరేత్ నిత్యం
మహాపాతక నాశనం "
( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు )
ఈ ఐదుగురిని రోజూ తలుచుకుంటే మహాపాతకాలు నశిస్తాయని స్మృతివాక్యం.
వీరిలో అహల్య, ద్రౌపది, సీత, మండోదరి బాగా అందరికీ తెలుసున్నవారే. మరి ఈ తార ఎవరు. అంతటి మహాపతివ్రత ఏమిటో చూద్దాం.
క్షీరసాగరమధన సమయంలో ఎందరో స్త్రీలు పుట్టుకొస్తారు. వారు సురులను( దేవతలను ) వివాహం చేసుకోమని అడుగుతారు. వారు ఒప్పుకోరు. అందుకని ఆ స్త్రీలను అప్సరసలు అన్నారు. వారిలో తార ఒకరు. అంటే ఆవిడ కూడా మిగతా పైనలుగురిలా అయోనిజయే.
ఈమె వాలిని వివాహమాడింది. వాలి దుందుభి కొడుకు మాయావిని చంపడానికి వెళ్ళి ఎన్నాళ్ళకూ తిరిగి రాకపోతే సుగ్రీవుడు రాజ్యాధికారాన్ని తీసుకుని తారను భార్యగా చేసుకుంటాడు. అది ఆకాలపు ధర్మమే.
వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని రాజ్యబహిష్కరణ చేసి తారను మళ్ళీ భార్యగా చేసుకుంటాడు.
ఇదేమిటీ అని అనిపించవచ్చు కాని అందులో తప్పు పట్టడానికి ఏమీలేదు. అది ఆ కాలధర్మం. తార వాలి దగ్గర ఉన్నా, సుగ్రీవుడు దగ్గర ఉన్నా వారి క్షేమమే కోరింది,మంచి సలహాలు ఇచ్చింది. తార వ్యక్తిత్వం, బుద్ధికుశలత అద్భుతం.
రాముడు వాలిని తప్పుబడతాడు కాని తారనేమీ అనడు పైగా ఓదారుస్తూ మంచి మాటలు చెబుతాడు.
సుగ్రీవుడు మొదటిసారి వాలిచేత దెబ్బలు తిని పారిపోతాడు. రాముడు మెడలో పూలదండవేసి మళ్ళీ పంపినప్పుడు వచ్చి భీకరంగా అరుస్తాడు. మళ్ళీ వాలి యుద్ధానికి వెళ్ళబోతూంటే తార అంటుంది " నీకు యుద్ధమే చేయాలనుంటే రేపు వెళ్ళు. ఇంతక్రితమే నీచేత దెబ్బలు తిని పారిపోయిన సుగ్రీవుడు వెంటనే మళ్ళీ కయ్యానికి వచ్చాడంటే ఏదో తేడాగా కనిపించట్లేదా నీకు. దూతలద్వారా నేను తెలుసుకున్నదేమిటంటే ఇక్ష్వాకు వంశీయులెవరో వచ్చారని, వారు సుగ్రీవుడితో మైత్రీబంధం చేసుకున్నారనీనూ. అంటే తన భర్త క్షేమంకోసం ఆమె అంత అప్రమత్తతో ఉందని తెలుస్తూంది.
వాలి తన మరణసమయంలో సుగ్రీవుడితో " తార విశేషప్రజ్ఞావంతురాలు, క్లేశాలలో విపత్తులలో నిబ్బరంగా ఉండి మంచిచెడ్డలు విచారించి నిర్ణయాలు తీసుకోగలదు. ఆవిడ నిర్ణయం ఏనాడూ వ్యర్ధంకాదు " అంటాడు.
ఆశ్చర్యం ఏమిటంటే వాలి చనిపోయే సమయంలో అంత దుఃఖంలోనూ కూడా తార శ్రీరాముడిని తప్పుపడుతూ ఒక్కమాట కూడా అనలేదు. అదీ తార ఉన్నత వ్యక్తిత్వం.
ఈవిషయం " సుగ్రీవుడు అశ్రద్ధచేస్తున్నాడని కిష్కింధను నాశనం చేసేస్తానని " లక్ష్మణుడు వచ్చి ధనుష్ఠంకారం చేసినప్పుడు తెలుస్తుంది. సుగ్రీవుడు భయపడిపోయి తారను పంపిస్తాడు, లక్ష్మణుడుని శాంతింపచేయడానికి. అప్పుడు ఆవిడ ప్రవర్తించిన తీరు, లక్ష్మణుడితో మాట్లాడిన మాటలు అద్భుతం.
అందుకే ఆమె ఆ నలుగురు పతివ్రతల ప్రక్కన సముచితస్థానం పొందింది.
గమనించవలసిన అద్భుతవిషయమేమిటంటే ద్రౌపది మాత్రమే మహాభారతంలోని స్త్రీ, మిగతా నలుగురూ రామాయణంలోని వారు.
తార మహాపతివ్రత.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
ఆ కాలం లో ఉన్న పతివ్రతల ఆకాలం లోనే ఉండ నిద్దాం. ఇప్పుడు వారి పేర్లను బయటపెట్టి ఈ కాలపు స్త్రీల లక్షణాలు వాళ్లకు ఆపాదించడం చెయ్యకూడదు.
ReplyDeleteఆకాలం ఈకాలం అని ఉండదండి. మంచివారు చెడ్డవారూ ఎప్పుడూ ఉంటారు. రామాయణకాలంలో సూర్ఫణఖ, భారతకాలంలో సైంధవుడు ఉన్నారుగా. ఇప్పుడు కూడా ఎంతోమంది ఉత్తములు ఉన్నారు. అందుకే వర్షాలు పడడం పంటలు పండడం జరుగుతూంది. మంచివారిని తరచూ స్మరించుకుంటే మంచిదేకదా. శుభం భూయాత్
ReplyDelete