శ్రీలలితాదేవీ నవరాత్రులు - రేపటినుంచి - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీమాత్రేనమః " 🙏
శ్రీలలితాదేవీ నవరాత్రులు - రేపటినుంచి అనగా చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ - భక్తులు లలితమ్మవారిని పూజించుకుని ఆవిడ ఆశీస్సులు అందుకుంటారు.
శ్రీలలితమ్మవారు భండాసురునితో యుద్ధానికి వెడుతూ జీవుల్ని ( మనల్ని ) జాగ్రత్తగా చూసుకోవడానికి బాధ్యతలను ఇద్దరికి అప్పగించారు. ఒకరు శ్రీవారాహీదేవి - రక్షణమంత్రిణి, కష్టసుఖాలు గమనించడానికి. రెండవవారు శ్రీశ్యామలాదేవి, ప్రధానమంత్రిణి, అందరి అవసరాలు గమనిస్తూ అనుగ్రహిస్తూ ఉండడానికి.
చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీలలితాదేవీనవరాత్రులుగా జరుపుకుంటారు భక్తులు. అషాఢశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీవారాహీదేవీనవరాత్రులుగా జరుపుకుంటారు. మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీశ్యామలాదేవీనవరాత్రులుగా జరుపుకుంటారు.
అమ్మవారు లలితాదేవి భండాసురునితో యుద్ధం చేస్తూన్నప్పుడు ఆ రాక్షసుడు " మహారోగాస్త్రం " ప్రయోగించాడు అందర్నీ రోగగ్రస్తులుగా చేయాలని. అమ్మవారు " నామత్ర్యయాస్త్రం " అంటే " అచ్యుత అనంత గోవింద " అస్త్రాన్ని ప్రయోగించారు. అందుకే ఎవరికైనా ఒంట్లోనలతగా ఉంటే ఈ మంత్రాన్ని ఇప్పటికీ జపించమని చెబుతారు. రాక్షసుడు " మారకాస్త్రం " ని ప్రయోగించాడు, అందర్నీ చంపేయాలని. అమ్మవారు " మహామృత్యుంజయమంత్ర " అస్త్రాన్ని ప్రయోగించి దానిని నిర్వీర్యం చేసారు. భండాసురుడి తమ్ముడు విశుక్రుడు విఘ్నయంత్రాన్ని ప్రయోగించడంతో అమ్మవారి సైన్యమంతా అడ్డంకులతోనూ నిస్పృహతోనూ నిండిపోతే అమ్మ ఆజ్ఞతో గణపతి వచ్చి ఆ యంత్రాన్ని నాశనం చేస్తాడు.
అలా ఎంతో శ్రమపడి ఆ రాక్షసుడిని చంపింది అమ్మవారు. అందుకే నూతన సంవత్సరారంభంలో మొదటి 9 రోజులను లలితమ్మవారి నవరాత్రులుగా జరుపుకుని ఆవిడ అనుగ్రహాన్ని పొందుతారు అందరూ.
" యాదేవి సర్వభూతేషు
మాతృరూపేణ సంస్థితా,
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః ".
శ్రీమాతా అని పిలిచినా శ్రీలలితాదేవ్యైనమః అని స్మరించినా " అవ్యాజకరుణామూర్తి " తల్లిలా ఆదుకుంటుంది.
మిత్రులు వారి కుటుంబసభ్యులకు శ్రీలలితాదేవి ఆశీస్సులు పుష్కలంగా కలగాలని కోరుకుంటూ, అందరికీ " శ్రీ క్రోధి నామ నూతన తెలుగుసంవత్సర మరియు ఉగాది " శుభాకాంక్షలు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment