మనిషి జీవితకాలం 120 సం.లు దాటదా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" భవదావ సుధావృష్టిః, 

  పాపారణ్యా దవానలా, 

  దౌర్భాగ్యతూలవాతూలా, 

  జ్వరాధ్వాంత రవిప్రభా " 

ఇవి అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 742,743,744,745 వ నామాలు. 

ఈ నామాలను రోజూ పారాయణ చేస్తే " జాతకం " చూపెట్టుకోవలసిన అవసరం లేదని పండితులు చెబుతారు. అంటే గ్రహదోషాలు అనేవి ఉండనే ఉండవు అని గ్రహించాలి.

వీటి అర్ధం చూద్దాం. అమ్మవారు సంసారమనెడి దావాగ్నికి అమృతవర్షం అవుతుంది, పాపమనెడి అరణ్యానికి దావాగ్నిలా వస్తుంది, దారిద్రమనెడి దూదికి ( తూల అంటే దూది ) సుడిగాలి అవుతుంది, ముసలితనం ( జ్వర అంటే ముసలితనం ) అనెడి చీకటికి సూర్యకాంతిలా వస్తుంది. అంటే జీవుణ్ణి బాధలనుంచి రక్షించడానికి అవసరమైనప్పుడు వర్షం, అగ్ని, గాలి, సూర్యకాంతి రూపంలో వచ్చి ఆదుకుంటుందని అర్ధం. శరణువేడిన వారికి అన్ని బాధలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇప్పుడొక అద్భుతమైన విషయం చూద్దాం. అమ్మవారు సృష్టిలో కాలచక్రం ఏర్పాటుచేద్దామనుకున్నప్పుడు సూర్యుడు ఉద్భవించాడుట. ఆయనవల్ల పగలు రాత్రి ఏర్పడి రోజు వచ్చింది. వారాలు నెలలు సంవత్సరం ఏర్పడ్డాయి. 

జీవుల జీవితకాలం ఏర్పరిచి దానిలో 9 గ్రహదశలు ఏర్పరిచింది. అవి వరుసగా రవి 6 సం లు, చంద్రుడు 10, కుజుడు 7, రాహువు 18, గురుడు 16, శని 19, బుధుడు 17, కేతువు 7, శుక్రుడు 20 సం లు. మొత్తం 120 సం లు. 

100 కాదు, 150 కాదు, బాగాపరిచయమైన 108 కాకుండా 120 అని ఎందుకు నిర్ణయించబడింది అని ఎవరికైనా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తే తప్పులేదు.

మొన్న ఓ వార్త చదివాను. మనుషుల్లో అత్యధికంగా జీవించిన వారి విషయసేకరణ చేస్తే బయటపడినది ఇప్పటివరకూ ఫ్రాన్స్ లో ఒకావిడ మాత్రమే 122 సం లు వరకూ జీవించిందని. అంటే ఇంకెవరూ 120 దాటలేదని. ఆవిడ వయస్సు లెక్క కూడా తప్పయి 120 లోపే ఉండి ఉండవచ్చు ( ఎవరినో కలిసిందని ఊహించి చెప్పడం వల్ల ) అనిపించింది. 110 ఏళ్ళు పైబడి జీవించినవారు చాలామంది ఉన్నారు. ఇది చదివిన వారికి ఆశ్చర్యం వేయకమానదు. అందుకే జీవితకాలం 120 సం.లుగా నిర్ణయం చేసారేమోనని. 

సృష్టి ఎంత క్రమబద్ధంగా, అందంగా, అద్భుతంగా, లోపరహితంగా ( రకరకాల మనుష్యులు, రకరకాల పువ్వులు వాటి రంగులు సువాసనలు ) చేస్తూంది అమ్మవారు అనిపించకపోదు. ఆశ్చర్యంకలుగకుండా ఉండదు. 

అమ్మవారిని సదా స్మరించుకుంటూ ఆవిడ అనుగ్రహాన్ని పొందుదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ