భక్తులకు సంపదలు తృణప్రాయం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" యం లబ్ధ్వా చాపరంలాభం
మన్యతే నాధికం తతః,
యస్మిన్ స్థితో న దుఃఖేన
గురుణాపి విచాల్యతే "
- భ.గీత 6:22
" పరమాత్మప్రాప్తిరూప లాభమును పొందినవాడు ( అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు) మఱేయితర లాభమునుగూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములును చలింపజేయజాలవు " అన్నారు పరమాత్మ.
భక్త రామదాసు ప్రజలు కట్టిన పన్నులను ప్రభుత్వానికి కట్టకుండా ఆ డబ్బుతో రాములవారికి గుడి కట్టించాడు, నగలు చేయించాడు. జైలులో పెట్టించినా, శిక్షించినా తొందరగా వచ్చి రక్షించమని రాముడినే వేడుకున్నాడు కాని రాజును వేడుకోలేదు.
పోతనామాత్యుడిని భాగవతాన్ని ఎవరికయినా ఓ రాజుకి అంకితమిస్తే కావలసినంత ధనం ఇచ్చి సత్కరిస్తారని ఎందరో నచ్చచెప్పాలని చూసారు. పోతన ససేమిరా అన్నారు. రాములవారికి అంకితమిచ్చారు, నా బాగోగులు ఆయనే చూసుకుంటారు అని నమ్మారు.
త్యాగయ్యని అన్నగారు కూడా " ఈ పాటలు కూడు పెట్టవు, ఏ రాజుని పొగుడుతూ పాడినా కోరినంత ధనం ఇస్తారు " అని నచ్చచెప్పడానికి ప్రయత్నంచేసాడు. అంతకన్నా పది ఇళ్ళలో బిక్షం ఎత్తుకోవడం నయం అన్నారు త్యాగయ్య, అలాగే చేసారు కూడా.
అన్నమయ్యని బంధువులు, స్నేహితులు " ఎన్నాళ్ళు ఇలా వెంకటేశ్వరుడి మీద కీర్తనలు చేస్తావు. ఓ రాజుని పట్టుకుని నాలుగు కీర్తనలు చేస్తే చాలు రాజు మణులు, మాణిక్యాలు ఇస్తారు " అని సలహా ఇచ్చినప్పుడు ఆయన చేసిన కీర్తన ఇది:
" పుట్టుభోగులము మేము
భువి హరిదాసులము,
నట్టనడిమి దొరలు
నాకియ్యవలెనా "
" పుట్టుకతోటే హరిదాసులం, హరి అనంతసంపదకు వారసులం మేము. మాకు నడమంత్రపు సిరిగాళ్ళు ఇచ్చేదేముంది " అని.
వీరెవరూ కూడా కష్టాలకు వెరవలేదు. పరమాత్మ అనుగ్రహానికి మించిన సంపద లేదని నమ్మినవారు వీరు. అదే బ్రహ్మానందస్థితి. ఆ స్థితిలో బాహ్యసుఖాలు, సంపదలు తృణప్రాయం సాధకులకు.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
ఓం తత్సత్, శ్రీ పరబ్రహ్మారణమస్తు
ReplyDelete