గురువు దేవుడూ సమానమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" గురుమూర్తిః " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 603 వ నామం. 

" గురుమూర్తిః " అంటే గురుస్వరూపురాలు.

" మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధిదేవోభవ " అంది తైత్తిరీయ ఉపనిషత్తు.

తల్లిని తండ్రిని ఆచార్యు( గురువు)ని, అతిధిని భగవంతునిగా భావించి గౌరవించు అంది సనాతనధర్మం.

" ఆచరతి ఆచారయతి ఇతి ఆచార్యః " అన్నాయి శాస్త్రాలు. అంటే తను ఆచరిస్తూ ( ధర్మాన్ని ) ఆచరింపచేసేవాడు ఆచార్యుడు అని.

" కౌసల్యా సుప్రజా రామా 

‌  పూర్వాసంధ్యా ప్రవర్తతే, 

  ఉత్తిష్ఠ నరశార్దూలా 

  కర్తవ్యం దైవమాహ్నికం " 

విశ్వామిత్రుడు తెల్లవారకముందే తాను లేచి కార్యక్రమాలు పూర్తిచేసుకుని శ్రీరాముడిని " తెలవారుతూంది, లేచి నీ కర్తవ్యం నిర్వహించు " అంటారు. అదీ ఆచార్యుని లక్షణం.

అందరు గురువులు పాఠాలు చెబుతారు కాని కొందరు గురువుల జీవితాలే పాఠాలవుతాయి. ఇలాంటివారిని " ఆచార్యులు " అని పిలుస్తారు. కంచిపరమాచార్యులు, రామకృష్ణపరమహంస, రమణమహర్షి లాంటివారు ఈ కోవలోకి వస్తారు.

గురువుల లక్షణాలు ఎలా ఉండాలో శాస్త్రాలు స్ఫష్టంగా తెలియచేసాయి. 

" సుందరస్సుముఖస్స్వచ్ఛః 

‌  సులభో బహుతంత్రవిత్,

  అసంశయత్ సంశయచ్చిన్ 

  నిరపేక్షో గురుర్మతః "

ఆయన సుందరంగా అంటే ఆదరస్వభావంతో ఉండాలి. సుముఖుడు అంటే ప్రసన్నమయిన ముఖంతో ఉండాలి. 

స్వచ్ఛముగా అంటే నిర్మలంగా ఉండాలి. సులభుడుగానూ, అన్ని తంత్రములు అంటే శాస్త్రములు తెలిసినవాడై ఉండాలి. సంశయములు లేనివాడిగానూ సంశయములు తీర్చేవాడిగానూ ఉండాలి. ముఖ్యంగా " నిరపేక్షుడు " గా అంటే ఏ ఆశలూ లేనివాడిగా ఉండాలి. 

ఎక్కడా ఏ గురువూ కూడా ఈ విద్యార్ధి పెద్దవాడయ్యాక తనకి సహాయపడతాడని అనుకున్నట్లుగా చూడలేదు, ఎవరూ చూసి ఉండరు.

ఓ రోజు ఓ ముసలావిడ తన 10 ఏళ్ళ మనుమడితో రామకృష్ణపరమహంస దగ్గరికి వచ్చి తన మనుమడు స్వీట్స్ ఎక్కువగా తింటున్నాడనీ, అతని ఆరోగ్యం పాడయిందనీ, వైద్యులు స్వీట్స్ తినడం మానేయమన్నా మానేయట్లేదనీ, తమరంటే వాడికి భక్తి గౌరవం కనుక మీరు చెబితే మానేస్తాడు కనుక దయచేసి వాడికి తినవద్దని చెప్పండి అని వేడుకుంది. ఆయన సరే మార్గం చూద్దాం ఓ నెలతరువాత మనుమడిని తీసుకుని రమ్మని చెప్పారు. నెలతరువాత వారు వస్తే పిల్లవాడితో " ఆరోగ్యం ముఖ్యం, స్వీట్స్ తినడం మానేయి ఈరోజునుంచి " అని చెబితే ముసలావిడ ఆశ్చర్యపోయింది. ఈ ముక్క చెప్పడానికేనా నెలతరువాత రమ్మన్నది అనుకుని ఆ విషయం ఆయన్నే అడిగింది. ఆయన అన్నారు " నేనూ స్వీట్స్ బాగానే తింటాను. మరి పిల్లవాడికి తినవద్దని ఎలా చెబుతాను, ఈ నెలరోజులు నేను తినడం మానేసి పిల్లవాడికి తినవద్దని చెప్పడానికి అర్హత పొందాను " అని. అవీ ఆచార్యుల లక్షణాలు.

అందుకే గురువులను/ఆచార్యులను గౌరవించమంది సనాతనధర్మం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ