శ్రీనృసింహజయంతి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

ఈ రోజు పరమపవిత్రమైన శ్రీనృసింహజయంతి.

సనాతనధర్మరక్షణకై శంకరాచార్యులు అంత చిన్న వయస్సులో దేశమంతా మూడుసార్లు కాలినడకన తిరిగారంటే అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఆయనపై ఈగకూడా వాలకుండా చూసుకున్న వారి శిష్యులు ఎంతటి అదృష్టవంతులు, కారణజన్ములు. వాదనల్లో ఒక్కొక్కరిని ఓడించుకుంటూ ముందుకు సాగుతూంటే శంకరులని కడతేర్చడానికి పలు కుట్రలు జరిగాయి. ఓ అద్భుత విషయం చూద్దాం.

ఓ సారి కొందరు ఓ కాపాలికుడిని కలిసి శంకరులని చంపమని అడిగారు. అతను శంకరులని కలిసి నమస్కరిస్తే " ఏమికావాలి " అని అడిగారు. మిమ్మల్ని బలి ఇస్తే నాకు కొన్నిశక్తులు వస్తాయి, సహకరించండి " అని అడిగాడు. ఆయన అన్నారు నేను సరే అని అన్నా నా శిష్యులు అది కుదరనివ్వరు, వారు దూరంగా ఉన్నప్పుడు ప్రయత్నించు అని చెప్పారు. 

ఓ రోజు శంకరులు శ్రీశైలం కొండమీద ఉన్నారు, శిష్యులు ఏదో పనిమీద కొండ దిగువకు వెళ్ళారు.

విషయం తెలిసి కాపాలికుడు వచ్చేసాడు. శంకరుల శిష్యుడు పద్మపాదుడికి ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతూందనిపించింది. గురువుగారిని వంటరిగా వదిలి వచ్చి పొరపాటుచేసామా అనుకున్నాడు. కాని కొండదిగువున ఉన్నాడు తను, ఏమి చెయ్యాలి. అప్పుడు శ్రీనృసింహస్వామిని ప్రార్ధించారు. అంతే 2,3 అంగల్లో కొండని ఎక్కేసి శంకరుల దగ్గరికి వచ్చేసాడు. శంకరులు పడుకుని ఉన్నారు, ఎవరో ఒకతను పెద్దకత్తితో శంకరుల కంఠాన్ని నరకడానికి కత్తిని పైకి ఎత్తుతున్నాడు. అంతే అతని తలను తొడిమనుంచి పువ్వును వేరుచేసినట్లు గిల్లేసాడు పద్మపాదుడు. చప్పుడికి శంకరులు కళ్ళుతెరిచి ఆశ్చర్యపోయారు. ఎదర ఉన్నది ఎవరో తెలిసిపోయింది, వెంటనే " శ్రీనృసింహ కరావలంబస్తోత్రం " తో ప్రార్ధన చెయ్యడం, నృసింహస్వామి పద్మపాదుడిలోంచి బయటకు రావడం జరిగింది. 

శంకరులు పద్మపాదుడిని " నృసింహస్వామి ఉపాసన చేస్తున్నావా? " అని అడగడం జరిగింది తరువాత.

ఇలా రెండు సార్లు జరిగింది.

శిష్యులు గురువులని అలా కాపాడుకునేవారు. శంకరులు ఎవరిఎవరితోనో వాదించి గెలిచారంటే శిష్యులు ఎంత జాగరూకతతో ఉండేవారో అర్ధం చేసుకోవాలి.

హిరణ్యకశిపుడు " ఎక్కడ నీ దేముడు " అని అడుగుతే ప్రహ్లాదుడు " నీకు ఎక్కడ చూడాలనుందో చెప్పు " అంటాడు. శరణాగతి పొందిన భక్తుడికి అంతటి విశ్వాసాన్ని కలుగచేస్తాడు పరమాత్మ. 

శ్రీనృసింహస్వామి " అవ్యాజకరుణామూర్తి ", పిలిస్తే పలికే దైవం. మనశ్శాంతిని ప్రసాదించమని అందరం వేడుకుందాం.

శ్రీనృసింహజయంతి శుభాకాంక్షలు.


ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ