కీర్తన అంటే అమ్మవారిని కీర్తించడం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ఉదారకీర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 848 వ నామం.
" ఉదారకీర్తిః " అంటే ఉత్కృష్టమయిన విస్తరించిన కీర్తి గలవారు అమ్మవారు అని.
ఉత్ అంటే ఉత్కృష్టమయిన. అర అంటే విస్తరించిన అని అర్ధం. అరవిరిసిన పువ్వు అంటే బాగా విచ్చుకున్న/విస్తరించిన పువ్వు.
అసలు కీర్తి ఎవరికి ద్రక్కుతుంది. సమాజానికి పనికివచ్చే మంచిపనులు చేసేవారికి.
అమ్మవారి కన్నా అర్హులు ఎవరు ఉదారకీర్తికి.
జీవుల ఆనందంకోసం మానసిక ప్రశాంతతకోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అమ్మవారు. రకరకాల వృక్షాలు, పువ్వులు, ఫలాలు, పక్షులు, జంతువులు, జలపాతాలే కాకుండా చక్కటి గాలి, నీరు, తృణధాన్యాలు సమకూరుస్తున్నారు.
అందుకే కృతజ్ఞతగా అమ్మవారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో " కీర్తనలు " చేసారు/చేస్తున్నారు మహాకవులు/వాగ్గేయకారులు.
అమ్మవారి గుణగణాలు అద్భుతం కనుకే కీర్తనలు అన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. కీర్తన పాడితే చాలు అమ్మవారు మురిసిపోతుంది.
మూకశంకరులు మూగవాడు. కామాక్షీదేవి అనుగ్రహంతో మాటవచ్చి అమ్మవారిని కీర్తిస్తూ 500 శ్లోకాలు ఆశువుగా చెప్పారు. అది మూకపంచశతిగా ప్రసిద్ధి చెందింది. మహదానందపడి " ఏమి కావాలో కోరుకో " అన్నారు అమ్మవారు. " నిన్ను కీర్తించిన ఈ నోటితో వేరే మాటలు మాట్లాడలేను తల్లీ. నన్ను మళ్ళీ మూగవాడిని చేసేయమ్మా " అని ప్రార్థించాడు, చిరస్మరణీయుడు అయారు.
ప్రశాంతమయిన జీవితాన్ని ప్రసాదించమని " అవ్యాజకరుణామూర్తి " ని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment