శ్రీపరశురామజయంతి శుభాకాంక్షలు.
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
నేడు శ్రీపరశురామజయంతి. విష్ణువు ఆరవ అవతారం.
ఈయన ప్రస్తావన రామాయణంలోనూ భారతంలోనూ కూడా వస్తుంది. పరశు అంటే గొడ్డలి, అది శివుడు ప్రసాదించినది. ఈయన తండ్రి జమదగ్ని కోపం నుంచి తల్లిని కాపాడిన విధం అద్భుతం. తమ తల్లి శిరస్సు ఖండించమని తన కుమారులను ఆదేశిస్తాడు జమదగ్ని.
అదేమిటి, అంత తపస్సంపన్నుడు సకలశాస్త్రపారంగతుడు అంత " అవివేకం " గా భార్యని చంపేయమనడం ఏమిటి అని అనుకోవనక్కరలేదు.
" దైవీహ్యేషా గుణమయీ
మమమాయా దురత్యయా "
- భ.గీత 7:14)
అన్నారు పరమాత్మ.
వశిష్టుడయినా విశ్వామిత్రుడయినా శ్రీరాముడయినా ఆఖరికి సీతమ్మయినా పరిస్థితుల ప్రభావంవలన వివేకం కోల్పోవడానికి అవకాశం ఉంది.
జమదగ్ని కొడుకులెవరూ తల్లిని చంపడానికి ముందుకురారు. అప్పుడు పరశురాముడిని తల్లిని సోదరులను సంహరించమంటాడు. వెంటనే సంహరిస్తాడు. సంతోషించిన జమదగ్ని వరం కోరుకోమంటే తల్లిని సోదరులను బ్రతికించమంటాడు.
ఆయన భీష్ముడికి, ద్రోణుడికి కూడా గురువులు.
21 సార్లు దండెత్తి రాజులను చంపేసిన తరువాత పాపహరణంకోసం తను జయించిన భూమండలాన్నంతా కశ్యపుడికి దానం చేసేస్తాడు. తన తపస్సుకు చోటులేకపోవడంతో సముద్రుడు కొంచెం వెనక్కి జరిగి భూభాగం ఇస్తాడు. అదే నేటి కేరళ. అది పరశురామక్షేత్రం.
మొగలులు మన పురాణాలను కూడా బాగానే వాడుకుందామని ప్రయత్నించారు. ఒకరిని దెబ్బతీయాలంటే వారి నైతికతను ప్రశ్నార్ధకం చేయడం ఒక పద్ధతి. ఆ కాలంలో భారతీయ రాజులందరూ ఎంతో ఉన్నతంగా ఉచ్ఛదశలో ఉండేవారు. మొగలులు " మీ పురాణాలలోనే ఉంది, పరశురాముడు 21 సార్లు దండెత్తి రాజులందరినీ చంపేసాడు " అని. అంటే ఇప్పుడున్న రాజులందరూ నకిలీలేగా అని రాజులను దెప్పిపొడుస్తూ కించపరచేవారు.
రాజస్తానీయ " జయపుర " పాలకుడైన మొదటి శ్రీసవాయీ జయసింహ మహారాజు " మా గ్రామవాసి, బంధువు, మహాపండితుడు అయిన " పండితరాయలును కలిసి విషయం చెప్పి " మమ్మల్ని నకిలీ అనడం బాధగా ఉంది, నేను ధనసహాయం చేస్తాను, తమరు ఆజ్మీర్ వెళ్ళి వారి భాషలు అరబ్బీ, పార్శీ, ఉర్దూలను నేర్చుకుని వారిభాషలోనే వారికి సరైన సమాధానం చెప్పి మా ఈ బాధను తొలగించాలి " అని అడగడంతో ఈయన ఆ భాషలలో పాండిత్యం సంపాదించి వచ్చి, మహారాజు పలుకుబడితో ఓ రోజు బాదుషా కొలువుకు వెళ్ళారు మౌల్వీలతో వాదనకు.
ఈయన మౌల్వీలతో వాదనలో చెప్పింది " అసలు 2వ సారి దాడి ఎందుకు జరుగుతుంది. మొదటిసారి దాడిలో అందరూ చనిపోకపోతే కదా. మరి 21వ సారి దాకా వెళ్ళిందంటే రాజులు ఇంకా అప్పటిదాకా ఉన్నట్లేగా. అప్పుడు ఆయన చంపడం ఆపేసారు. అప్పటికి కొందరు రాజులు మిగిలి ఉండవచ్చు, రాణులు, వారి కూతుళ్ళు, కోడళ్ళు గర్భవతులయి ఉండవచ్చుకదా. మిగిలి ఉన్న రాజులు, తరువాత పుట్టిన బిడ్డలే ఇప్పుడు రాజ్యాలేలుతున్న రాజులు. మీరు అనుకుంటున్నట్లు నకిలీలు కారు " అని చెప్పి అందరి నోర్లూ మూయించారు.
" యదాయదాహి
ధర్మస్య....సృజామ్యహం
- ( భ.గీత 4:7 ) "
సనాతనధర్మానికి ఎప్పుడు అవమానం/హాని జరిగినా సరిదిద్దడానికి అమ్మవారు ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటుంది.
శ్రీపరశురామజయంతి శుభాకాంక్షలు అందరికీ.
ఏతత్ సర్వం శ్రీపరమాత్మార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment