ఇష్టం లేని పనులు కూడా ఎందుకు చేస్తూంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" స్వభావజేన కౌంతేయ
నిబద్ధః స్వేన కర్మణా,
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్
కరిష్యస్యవశో2పి తత్ "
- భ.గీ 18:60.
" నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి చేయుదువు " అన్నారు పరమాత్మ.
మనల్ని మనలా ఉండనివ్వదు సమాజం. పరిస్థితుల ప్రభావానికి లోనై జీవుడు తను చేయాలని అనుకోని, చేయకూడని పనులు కూడా చేస్తూంటాడు. ఆవేశంలో చేసే ఎన్నో ఘోరాలు తరచుగా చూస్తూంటాం.
" ఏవం బుద్ధిశ్చ తేజశ్చ
ప్రతిపత్తిశ్చ భారత,
భవంతి భవకాలేషు
విపద్యంతే విపర్యయే "
వ్యాసమహర్షి అంటారు అర్జునుడితో " ఇవే బుద్ధి తేజస్సు ఇతరపరికరాలు అంటే శక్తి, మనస్సు వంటివి ఉంటాయి - కాలం కలిసివచ్చినప్పుడు రాణిస్తాయి, కలిసి కలిసిరానప్పుడు ఏవీ పనికిరాకుండా పోతాయి " అని.
కాలప్రభావం చాలా భయంకరమైనది. ఎంతటి వారినైనా వంచేసి మాయలో ముంచేస్తుంది.
పరీక్షిత్ మహారాజు చక్కటి పాలన చేయడమేకాదు కలిప్రభావ వాసనలు కనబడుతూండడంతో దేశసంచారం చేస్తూ అధర్మం ఎక్కడా జరగకుండా అడ్డుకుంటున్నాడు. అంతటి ధర్మపరుడు ప్రజలను క్రూరమృగాలనుంచి రక్షించడం కోసం వేటకు వెళ్ళడం, వేటలో అలసి శమీకమహర్షి ఆశ్రమానికి వెళ్ళడమేమిటి, సమాధిస్థితిలో ఉన్న మహర్షిని మంచినీరు అడగడం, ఆయన స్పందించలేదని అక్కడ చచ్చిపడివున్న పాముకళేబరాన్ని మహర్షి మెడలో వేసి వెళ్ళడమేమిటి. ఇటువంటి పనిని పరీక్షిత్ మహారాజునుంచి ఊహించగలమా. ఇదే కాలప్రభావం అంటే.
అందరూ చదువుకున్నవారే. ఎంతో నిగ్రహంతో ఉందాం అనుకుంటారు. ఎక్కడ కుదురుతుంది. కాలం బాగుండనప్పుడు వివేకాన్ని " అవివేకం " కమ్మేస్తుంది. అహంతో బురదలో కూరుకుపోతూంటారు.
అటువంటి " మాయ " లో పడకుండా ఉండాలంటే పరమాత్మ పాదాలే శరణ్యం.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment