మనస్సు నిర్మలంగా ఉంటే ఏ గొడవలు ఉండవు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శుద్ధమానసా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 973 వ నామం.
" శుద్ధమానసా " అంటే నిర్మలమయిన మనస్సుకలది అని అర్థం.
సహజంగానే ఏ అమ్మ మనస్సు అయినా నిర్మలంగానే ఉంటుంది. మరి అమ్మలగన్నయమ్మ మనస్సు నిర్మలంగా ఉండకుండా ఎలా ఉంటుంది.
సహజంగా ఎవరి మనస్సయినా నిర్మలంగానే ఉంటుంది. మనస్సు అంతఃకరణాలలో మొదటిది. అది సంకల్ప వికల్పాలను రెండింటినీ చేస్తుంది. వికల్పాలు అంటే చెడు పనులు/ఆలోచనలు. అటువంటివి చేయాలని ఎవరికీ ఉండదు. కాని ప్రకృతి/సమాజం అలా ఉండనివ్వదు. మాయ చేస్తుంది.
నిర్మలంగా ఉన్న సరస్సులో ఓ రాయి వేస్తే తరంగాలు మొదలవుతాయి. అలాగే ఓ చెడు లేక ఇష్టంలేని సంఘటన జరగగానే మనస్సులో తరంగాలు మొదలవుతాయి. వాటిలో సుఖ, దుఃఖ తరంగాలు రెండూ ఉంటాయి. అవి జీవుడి కర్మఫలాల మీద ఆధారపడి ఉంటాయి.
" వికారహేతౌ సతి విక్రయంతే
ఏషాన్నతేతాంసి
తవేయ ధీరాః "
అన్నారు కాళిదాసు. ఎదురుగా వికార సంఘటనలు జరుగుతూన్నా మనోవికారానికి లోను కానివారు ధీరులు అని. అది అంత సులభం కాకపోయినా అసాధ్యం కాదు. సంఘటన ఒకటే అయినా అందరూ ఒకేలా స్పందించరు.
" అసంశయం మహాబాహో
మనో దుర్నిగ్రహం చలం "
- భ.గీత 6:35
" మనస్సును నిగ్రహించుకోవడం అంత సులభం కాదు " అన్నారు పరమాత్మ గీతలో.
" తన్మే మనః శివసంకల్పమస్తు - సంకల్పసూక్తం " - మా మనస్సులలో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే కలిగించు తల్లీ అని అమ్మవారిని వేడుకుంటే ఆవిడ మన మనస్సులను కూడా నిర్మలంగా ఉంచుతారు. నాస్తి సంశయం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment