మనమందరం సదాశివకుటుంబీకులం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సదాశివకుటుంబినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 911వ నామం.
" సదాశివకుటుంబినీ " అంటే సదాశివుని భార్య, సదాశివకుటుంబానికి అధిపతి. జీవులందరూ సదాశివ కుటుంబ సభ్యులే.
" త్రిగుణాతీతమై లోకాతీతమై సర్వాతీతమై శాంతమైన తత్వమే శివతత్వం " - ఆ స్థితిలో అంతా ఆనందమే. అదే సత్యం శివం సుందరం.
విష్ణుసహస్రంలో " శివః " అని ఒక నామం. ఆ నామానికి " శాశ్వతుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
శ్రీ శంకరాచార్య విరచిత అన్నపూర్ణాష్టకంలో ఇలా ప్రార్థిస్తాం:
" మాతా చ పార్వతీ దేవీ
పితా దేవో మహేశ్వరః
బాంధవా శ్శివభక్తాశ్చ
స్వదేశో భువనత్రయమ్ "
పార్వతీదేవి నా తల్లి, మహేశ్వరుడు నా తండ్రి, శివభక్తులు నా బంధువులు, మూడు ప్రపంచాలు నా సొంత దేశం. ఎంత అద్భుత భావన. ఇటువంటి భావనతో జీవిస్తూంటే అమ్మవారు చల్లగా చూడకుండా ఎలా ఉండగలదు. మామూలుగానే ఆవిడ అవ్యాజకరుణామూర్తి.
మేము సదాశివకుటుంబీకులం అని చెప్పుకుంటే ఎంత గర్వంగా, అద్భుతంగా ఉంటుంది.
విభీషణుడు రావణుడిని విడిచిపెట్టి రాముడు దగ్గరకు వచ్చినప్పుడు వానరవీరులందరూ శతృవుని చేరదీయడం మంచిదికాదంటారు. అప్పుడు రాముడు ఇలా అంటారు:
" సకృదేవ ప్రపన్నాయ
తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో
దదామి ఏతత్ వ్రతం మమ "
" ప్రపన్నాయ " అంటే శరణాగతి. " తవాస్మీతి " అంటే నీవాడను. అతను వచ్చి " నీవాడను " అంటే ఎలా చేరదీయకుండా ఉంటాను, రావణుడు వచ్చి అలా అన్నా చేరదీస్తాను అంటారు రాముడు.
ఇకపై మనమందరం " మేము సదాశివకుటుంబీకులం " అని గర్వంగా చెప్పుకుందాం. మన బాగోగులు అన్నీ అమ్మవారే చూసుకుంటారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment