కబీర్ దాసు రామభక్తుడు ఎలా అయాడు? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" యస్య దేవే పరాభక్తిః
యధా దేవే తధా గురౌ "
- కఠోపనిషద్
" ఏ దేవి అనుగ్రహం కోసం జపం చేస్తున్నామో ఆ దేవిమీద అఖండభక్తి ఉండాలి. అంతే భక్తి గురువుమీద ఉండాలి " అని కఠోపనిషద్ తెలియచేస్తూంది.
కబీర్ దాసు కాశీలో ఉండేవారు. ఆయనకు శ్రీరాముడు అంటే అపరిమితమైన భక్తి, నమ్మకం. రామజపం పారాయణ చేయాలని, చేసి తరించాలని కోరిక.
కాశీలోనే ఉన్న రామానంద అనే రామభక్తుడిని రామనామం ఉపదేశం చేయమని కోరారు. ఆయన అన్యమతస్తులకి చేయలేనని సున్నితంగా తిరస్కరించారు.
ఎందరో రామభక్తులని, పండితులని కలిసాడు, బ్రతిమాలాడు. ఎవరూ కనికరించలేదు.
ఓరోజు ఉదయాన్నే సూర్యుడు ఇంకా ఉదయించలేదు. రామభక్తుడు రామానంద గంగలో స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. కొద్దిగా చీకటిగానే ఉంది. ఆ సమయంలో కబీర్ చెట్టుచాటునుంచి హఠాత్తుగా వచ్చి రామానందగారి కాళ్ళకు నమస్కరించబోయాడు. రామానందగారు " రామ రామ " అని వెనక్కు ఉరికారు.
కబీర్ " చాలు గురువుగారూ. ఇదే మీ ఉపదేశంగా స్వీకరిస్తున్నాను " అని నమస్కారం చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. రామజపం నిరంతరం పారాయణ చేసి శ్రీరామ సాక్షాత్కారం పొందారు.
కారణజన్ముడు. సంకల్పంతో పాటు దేముడిమీద, గురువుమీద అచంచలమైన విశ్వాసం, గౌరవం, భక్తి ఉండాలి. అప్పుడు ఏదీ అసాధ్యంకాదు.
హనుమకు నారదులు ఉపదేశించిన త్రయోదశాక్షరమంత్రం " శ్రీరామ జయరామ జయజయ రామ ". 13 అక్షరముల నామం.
భక్త రామదాసు " శ్రీరామ జయరామ జయజయ రామ " నామజపం 13 కోట్లు పారాయణ చేసారు, శ్రీరామ సాక్షాత్కారం పొందారు.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment