గణపతి నామంలో అంత మహత్తు ఉందా?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

సోమకాంతుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఎన్నో యజ్ఞయాగాలు చేసాడు. ఎన్నో రాజ్యాలను జయించాడు. ధర్మపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది. పిల్లలు పెద్దవారయారు.

అంతా సవ్యంగా సాగుతూన్న సమయంలో రాజుకి కుష్టువ్యాధి సోకింది. రాజవైద్యులు మందు ఇస్తున్నారు. దేశదేశాలనించి వైద్యులు వచ్చి మందులు ఇచ్చారు కాని తగ్గుముఖం పట్టలేదు సరికదా ముదురుతూంది.

రాజు పుణ్యనదులలో స్నానం, పుణ్యతీర్థాల దర్శనం చేస్తే పాపపరిహారమైనా అవుతుంది అని తలచి కొడుకులకు రాజ్యం అప్పగించి బయలుదేరబోతే భార్య తనూ వస్తానంది. మంత్రులు ఇతర అధికారులు కూడా " ఇంతకాలం మీ పరిపాలనలో ఎంతో హాయిగా గడిపాం. ఈ కష్టసమయంలో మీకు తోడుగా మేమూ వస్తాము " అన్నారు.

అలా అందరూ బయలుదేరారు. ఓ రోజు ఓ నదివైపు స్నానానికి వెడుతూంటే నదీస్నానం చేసి వస్తూన్న ఓ ముని కుమారుడు వీరిని చూసి ఆశ్చర్యపోయాడు. రాజు అతని భార్య ముఖవర్ఛస్సు చూసి ఎవరు మీరు అని అడగడం వారు తమ వృత్తాంతమంతా చెప్పడం జరిగింది. వెళ్ళిరండి అని ముని కుమారుడు వెళ్ళిపోయాడు.

ఆ ముని కుమారుడి పేరు చ్యవనుడు. భృగుమహర్షి కుమారుడు. ఆశ్రమానికి వెళ్ళి తండ్రికి విషయం చెబుతాడు. మహర్షి " ఆశ్రమం ప్రాంతానికి వచ్చినవారు మన అతిధులు. తోచిన సహాయం చేయాలి. వెళ్ళి వారిని తీసుకునిరా " అంటారు. అతను వెళ్ళి వారిని తీసుకునివస్తాడు.

మహర్షి వారు చెప్పినది విని ధ్యానంలో కూర్చుని రాజు పూర్వజన్మ వృత్తాంతం చూస్తారు.

ఆ రాజు పూర్వజన్మలో " కామంతుడు " అనే వైశ్యుడు. ధనవంతుల కుటుంబం. కాని అన్ని వ్యసనాలకు బానిస అయి సంపదంతా పోగొట్టుకుని ఇంటినుండి ఊరు నుండి బహిష్కరించబడుతాడు. 

ఒక అడవిలో తోడుగా నలుగురుని పెట్టుకుని అడవిదాటేవారిని చంపేయడం, సంపద దోచుకోవడం చేస్తూ సంపదను విపరీతంగా పెంచుకున్నాడు. వయస్సు పెరిగేకొలదీ భయం మొదలయింది, ఎంతో పాపం చేసాను, ఎలా అని.

సహాయకులని " చుట్టుప్రక్కల ఉన్న మునులను, మంచివారిని తీసుకురండి. మా యజమాని దానాలు చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పండి " అని తలో దిక్కుకి పంపాడు. చాలామంది వచ్చారు. ఇతను ఆ సంపద ఎలా సంపాదించినదో చెప్పి దానం తీసుకోమంటే వారు అటువంటి దోచిన ధనాన్ని స్వీకరించమని వెళ్ళిపోతారు.

 *ఇక్కడ ఒక గమనించవలసిన విషయం జరిగింది. వారు డబ్బు తీసుకోకపోవడమే కాకుండా సమీపంలో ఉన్న నదికి వెళ్ళి " పతిత సంభాషణా పాపపరిహారార్ధం " అని సంకల్పం చెప్పుకుని స్నానాలు చేస్తారు. ప్రజలసొమ్ము దొంగిలించిన వాడితో మాట్లాడడం వల్ల పాపం వస్తుంది అని తెలుసుకోవాలి. అటువంటివాడిని చూసినా కూడా పాపం రావచ్చు.* 

అతను బాధపడి కొంత సంపదని సహాయకులకు పంచి వారిని పంపించేసి మిగతా ధనంతో అడవిని వదలి ఓ గ్రామం చేరుతాడు. ఆ గ్రామంలో ఓ పాడుబడిన గుడి ఉంది. ఊరి పెద్దను కలిసి " ఆ గుడిని బాగుచేద్దామనుకుంటున్నాను, ధనం నేను ఇస్తాను, మీరు ఏర్పాట్లు చూడాలి " అనడంతో ఊరివారందరూ కూడా సంతోషించారు. అద్భుతమయిన గుడి తయారయింది. కొన్ని తరాలవరకూ ఆ గుడిలో పూజాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా ఏర్పాటు చేసాడు. కొన్నాళ్ళకి మరణించాడు. యమలోకానికి చేరాడు. యమధర్మరాజు " ముందు పుణ్యం అనుభవిస్తావా, పాపమా " అని అడిగితే ఇతను ఆశ్చర్యపోయాడు, నాకు పుణ్యం ఎలా అని.

అప్పుడు యమధర్మరాజు చెబుతారు " నువ్వు బాగుచేయించిన గుడి గణపతిది. ఆ పుణ్యం ఇంత అని చెప్పడం కష్టం. నువ్వు చక్రవర్తిగా జన్మించి ధర్మపాలన చేయి ముందు. తరువాత పాపఫలం చూద్దాం " అని.

అలా సోమకాంతచక్రవర్తి అయాడు. పుణ్యంఫలం అయిపోయే సమయానికి పాపఫలం అనుభవించడానికని కుష్టువ్యాధి మొదలయింది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భృగుమహర్షి రాజుకి " గణేశవైభవం " అనే పురాణాన్ని వినిపించడం, అతని కుష్టువ్యాధి పూర్తిగా నయమవడం జరిగింది. 

అదీ గణపతి మహత్యం. నమ్మి సేవించాలేకాని ఆయన ఇవ్వలేనిదంటూ లేదు.

" తత్పురుషాయ విద్మహే 

  వక్రతుండాయ ధీమహి 

‌  తన్నో దంతిః ప్రచోదయాత్ " 

ఏతత్ సర్వం శ్రీగణేశార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ