ధీరుల పూజలకు కారణం ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ధీరసమర్చితా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 917వ నామం.
" ధీరసమర్చితా " అంటే పండితులచే/ధీరులచే బాగుగా పూజింపబడినది.
ఇటువంటి వారికి ప్రాపంచిక విషయాలు పట్టవు. ఎప్పుడూ భగవంతుడి ధ్యాసే.
శౌనకమహర్షి అడుగుతారు సూతమహర్షిని " శుకులకు మోక్షప్రాప్తి తప్ప వేరే కోరికలే లేవుకదా, ఆయన భాగవతం ఎందుకు అభ్యసించారు ( అవసరం ఏమిటి ) " అని. అప్పుడు సూతమహర్షి అంటారు ఇలా:
" ధీరులు నిరపేక్షులు
నాత్మారాములునైన
మునులు హరిభజనము
నిష్కారణమ
చేయుచుందురు
నారాయణుఁ డట్టివాఁడు
నవ్య చరిత్రా "
- పోతనభాగవతం.
అటువంటి వారు చేసే జపాలకు, పారాయణలకు, పూజలకు కూడా కారణమేమీ ఉండదు. అదో వ్యాపకం అయిపోతుంది వారికి.
స్వామి రామతీర్థ ( వేదాంత గురు ) ఋషికేష్ లో ఉండగా ఒక బంధువు వచ్చి " మురళీవాలాలో ఉన్న నీ కుమారుడు మరణించాడు " అని చెబుతే ఆయన అన్నారు " గాలి వీచడం, నీరు ప్రవహించడం లాగే జననమరణాలు కూడా అతి సహజ ప్రక్రియ. ఎక్కువ ఆలోచన చేయనక్కరలేదు వాటి గురించి " అని. స్థితప్రజ్ఞులు.
కంచి పరమాచార్య, రమణమహర్షి వంటివారు మనతో మాట్లాడుతూన్నా వారికి లోపల జపం జరిగిపోతూనే ఉంటుంది సహజంగానే. మనల్ని చూస్తున్నారనుకుంటాం కాని మన రూపం వారి కంటి దగ్గరే ఆగిపోతుంది, వారి మనస్సుపై పడదు.
అందరు పీఠాధిపతులు అలా ఉండలేరు. కొందరికి పాత వాసనలు అంత తొందరగా పోవు. అటువంటి స్థితికి అమ్మవారి అనుగ్రహం కావాలి.
ఈరోజు " అక్షయ తృతీయ " మరియు శుభ శుక్రవారం - ఏది చేసినా అక్షయం అవుతుంది. అక్షయతృతీయ శుభాకాంక్షలు.
మరీ ప్రాపంచిక విషయాలలో పూర్తిగా మునిగిపోకుండా చూడమని అమ్మవారిని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment