మంచి చెబుతే ఎవరికి నచ్చుతుంది - కలికాలం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" ఏవం పరంపరాప్రాప్తం    

  ఇమం రాజర్షయో విదుః,

  స కాలేనేహ మహతా           

  యోగో నష్టః పరంతప " 

                 - భ.గీత 4:2

ఓ పరంతపా! (అర్జునా!) ఈ విధముగ పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎఱింగిరి. కాని అనంతరము ఈ యోగము ( భగవద్గీత ) కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను.

ఎంత అద్భుత విషయం. లుప్తప్రాయమయింది అన్నారు పరమాత్మ. అంటే మరుగున పడిపోయింది అని.

కలి ప్రభావం వలన మంచి చెబితే నచ్చదు. కష్టపడి పనిచేయి. పరుల సొమ్మును ఆశించకు. పరస్త్రీ వ్యామోహం వద్దు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. తల్లిదండ్రులను గురువులను గౌరవించు. లోభం మోహం వద్దు. నలుగురికీ మంచి చేస్తూ ఉండు. అన్ని జీవులను ఒకే విధంగా గౌరవించు. సంపాదించిన దానిలో కొంత దానధర్మాలకు ఉపయోగించు. అతిగా తిన్నా అతిగా నిద్రపోయినా లేక అసలు తినకపోయినా నిద్రపోకపోయినా మనస్సు నిలకడగా ఉండక తప్పుడు ఆలోచనలు, పనులు చేయిస్తుంది. అందుకని మితాహారం మితనిద్ర పాటించు. 

మానసిక ప్రశాంతతకు, ఆనందకరమైన జీవితానికి ఇటువంటి మంచివిషయాలను చెబితే ఎవరికి మాత్రం సమ్మతంగా ఉంటుంది. చెడు వింటూ, చెడు చేస్తూ, చెడుతో సావాసం చేస్తూ చెడులోనే జీవించేవారికి గీతలోని విషయాలు ఎలా నచ్చుతాయి. అందుకే భగవద్గీత అంటే ఎక్కువమందికి చిన్నచూపు. 

అందుకే " అది మరుగున పడిపోయింది. నీకు మళ్ళీ చెబుతున్నాను " అన్నారు పరమాత్మ అర్జునుడితో.

మళ్ళీ మరుగున పడిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరిమీదా ఉంది అని గ్రహించాలి.

బాల్యంనుంచే బడులలో పిల్లలచేత గీతను చదివిస్తే వారు బాధ్యత కలిగిన పౌరులుగా తయారవుతారు. వారి జీవితాలు ఆనందదాయకంగా, స్ఫూర్తిదాయకంగా తయారవుతాయి. సమాజానికి మేలు జరుగుతుంది. ఇంతమంది రక్షకభటులు, న్యాయస్థానాలు, కారాగారాల అవసరం ఉండదు కూడా. శాంతి సామరస్యంతో సమాజం కళకళలాడుతూ ఉంటుంది.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ