సమాజ శ్రేయస్సుకు కోపం కూడా అవసరమే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" క్రోధశమనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 169 వ నామం.
" క్రోధశమనీ " అంటే కోపాన్ని పోగొట్టునది అని. కోపం అనర్ధహేతువు. అనుబంధాలు, ఆరోగ్యం చెడతాయి కోపం వలన.
శ్రీసూక్తం ఇలా చెబుతూంది:
"న క్రోధో న చ మాత్సర్యం
న లోభో నాశుభా మతిః
భవంతి కృతపుణ్యానాం
భక్తానాం శ్రీసూక్తంజపేత్సదా"
పుణ్యం చేసిన భక్తులకు కోపంరాదు, అసూయ కలుగదు, లోభం నశిస్తుంది, దుర్బుద్ధి ఉండదు. శ్రీసూక్తం చదువుతే భక్తి కలుగుతుంది.
విష్ణుసహస్రంలో " క్రోధహా " అని ఒక నామం ఉంది. నామార్ధం " కోపాన్ని తొలగించువాడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
ఆశ్చర్యకరంగా " భవనాశినీ, లోభనాశినీ, మోహనాశినీ " అన్నట్లుగా " క్రోధనాశినీ " అనకుండా " క్రోధశమనీ " అని ప్రార్థిస్తారు అమ్మవారిని. శమనీ అంటే తగ్గించడం.
కోపం కూడా అవసరమే. పిల్లలు అల్లరి, తప్పులు చేస్తూంటే అమ్మ కోప్పడుతుంది. లేకపోతే పిల్లలకు గారాబం ఎక్కువయి దారితప్పే ప్రమాదముంది.
కోపంలేనివాడు రాజు ఎలా అవుతాడు అంటున్నాయి శాస్త్రాలు. అధర్మం చేసినవారిని శిక్షించాలంటే కోపం రావాలి/కలగాలి.
లంకకు చేరడానికి తనకు, వానరసైన్యానికి దారి ఇవ్వలేదని రాముడు కోపంతో కోదండాన్ని తీసుకుని బాణం సంధిస్తేకాని సముద్రుడు ఎదరికి రాలేదు.
అవసరమయినప్పుడు, ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు కోపం తెచ్చుకోవాలి. ఎప్పుడూ శాంతమూర్తిలా ఉండిపోతే పనులు అవవు, సమాజానికి శుభం జరుగదు.
అవసరంలేని, దేనికీ ఉపయోగపడని కోపాన్ని నశింపచేస్తుంది అమ్మవారు.
అలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment