అధికారులు అందరూ శ్రద్ధగానే పనిచేయాలనుకుంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ప్రియవ్రతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 770 వ నామం.
" ప్రియవ్రతా " అంటే వ్రతమును ఇష్టపడతారు అని.
వ్రతం అంటే శ్రద్ధగా చేయడం. శ్రద్ధగా చేసే ఏ పని అయినా వ్రతం అని పిలువబడుతుంది.
" యాదేవి సర్వభూతేషు
శ్రద్ధా రూపేణ సంస్థితా,
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమోనమః "
అని ప్రార్థిస్తాం అమ్మవారిని. ఆవిడ జీవుల్లో శ్రద్ధ రూపంలో ఉంటారు.
సమున్నత లక్ష్యసాధనకోసం చేసే ప్రయత్నాలన్నిటికీ శ్రద్ధ అత్యావశ్యకం అన్నారు శంకర భగవత్పాదులు. తరగతిలో ఉండే 40 మంది విద్యార్థులకు ఒక గురువే పాఠం చెప్పినా వారి ఉత్తీర్ణతలో తేడా ఉంటుంది. అది శ్రద్ధలో తేడా.
10 గం.లకు కార్యాలయం అంటే 9.55 కి రోజూ కార్యాలయంలో ఉండడం కూడా వ్రతమే. అతను ఏపని అయినా ఎంత శ్రద్ధగా చేస్తాడో అనడం వింటూంటాం. అతనికి ఆరోగ్యంమీద ఎంత శ్రద్ధో అనడం వింటూంటాం. కొందరు గురువులు ఎంతో శ్రద్ధగా పాఠం చెబుతారు.
అరణ్యవాసంలో సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమంకి వెడతారు. అనసూయమ్మ సీతతో ఇటువంటి సమయంలో నువ్వు రాముడిని అనుసరించడం చాలా ఆనందంగా ఉంది నాకు అని అంటూ " దిష్ట్యా ఆచరితం ధర్మం " అంటారు. అంటే ధర్మం ఆచరించడానికి అదృష్టం కూడా కలిసి రావాలి అని. అప్పుడు సీతమ్మ అంటుంది " రాముడి లాంటి భర్త దొరికితే అది ( వ్రతపాలన ) కష్టం కాదు " అని. అద్భుతమయిన సందేశం భారతీయులకు.
అందరు అధికారులు శ్రద్ధగా పనిచేయాలనే అనుకుంటారు. కాని పరిస్థితులు ( అదృష్టం ) కూడా కలిసిరావాలి. అంటే నాయకుడు సరైన వాడు అవుతేనే అది వీలు పడుతుంది. ఈ విషయాన్నే సీతమ్మ " రాముడి లాంటి భర్త/నాయకుడు దొరికితే వ్రతపాలన కష్టం కాదు " అన్నారు.
అందరికీ శ్రద్ధను అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment