రంగుల ప్రపంచం అంతా మాయే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" విష్ణుమాయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 339 వ నామం.
" విష్ణుమాయా " అంటే సర్వవ్యాపకుడగు భగవంతుని మాయ అని అర్ధం. ప్రకృతి/ప్రపంచం అంతా నిండి ఉన్న మాయ.
" మాయ " అంటే మభ్యపెట్టడమో, మోసమో కాదు. లేనిది అని అర్థం.
దేవీ అపరాజితా స్తోత్రం ఇలా తెలియచేస్తూంది:
యా దేవీ సర్వభూతేషు
విష్ణుమాయేతి శబ్దితా,
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః " - 6
సర్వభూతాలలోనూ ఉన్న విష్ణుమాయగా పిలువబడుతున్నారు అమ్మవారు అని.
ఆదిశంకరులను ఒక భక్తుడు " అంతా మిథ్య/మాయ " అంటున్నారు మీరు. కుక్క మొరుగుతూంది, కరుస్తూంది. మాయ ఎలాగ అవుతుంది " అని అడిగాడు. శంకరులు అన్నారు " కలలో కూడా కుక్క తరుముతూంది, కరుస్తూంది కదా. ఇదీ అలాంటిదే. భ్రమ " అని.
కలలో కుక్క కరవడానికి ముందుకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దానిని తన్నుతున్నాననుకుని ప్రక్కన పడుకున్న భార్యని తన్ని ఉంటారు చాలామంది. ఎందరు గుండెనొప్పి తెచ్చుకుని ఉంటారు. రాత్రి వార్తలు అవీ చూసి హాయిగా నిద్రపోయిన వారు తెల్లవారి లేవరు. గుండె పోటుతో ఎలా మరణిస్తారు. కలే కదా అని కలలో ఏదీ పట్టించుకోకుండా కూర్చోవట్లేదుగా.
ప్రకృతిలో కనబడేది అంతా నిజం/సత్యం అయితే అందరికీ ఒకేలా ఉండాలి/కనబడాలి కదా. ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు, ఒకరికి ఆనందాన్ని ఇచ్చేది ఇంకొకరికి బాధగా అనిపిస్తుంది, అలా ఎలా?. ఒక నాయకుడు చేసినపని కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అలా ఎలా?. మహామాయ.
మూకశంకరులు " ఆర్యాశతకం " లో కామాక్షీదేవిని ఇలా కీర్తిస్తారు:
" అభిదాకృతిర్భిదాకృతి రచిదాకృతిరపి
చిదాకృతిర్మాతః అనహన్తా త్వమహన్తా
భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం "
అమ్మా కామాక్షీ, నీవు భేదములేనిదానవు అయినను భేదముకలదానివి, జడమైనను చైతన్యరూపిణివి, అహంతలేని దానివి అయినను అహంతారూపిణివి. శాశ్వతమయిన దానివై ప్రపంచమును భ్రమింపచేయుచున్నావు.
అలా ప్రకృతి అంతా ఆవిడే అయినందువల్ల ఏది సత్యమో ఏదసత్యమో తెలియక జీవులు మాయలో బ్రతుకుతున్నారు.
మన మనసుల్లో ఎల్లప్పుడూ సత్సంకల్పాలే కలిగిస్తూ, పూర్తిగా మాయలో కూరుకుని పోకుండా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment