అమ్మవారు పుట్టుక లేనిది, శాశ్వతురాలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శాశ్వతీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 951 వ నామం.
" శాశ్వతీ " అంటే నిత్యమయినది/శాశ్వతమయినది. అంటే నాశనము లేనిది అని. పుట్టుక ఉంటే మరణం ఉంటుంది. అమ్మవారు " అజా ", అంటే పుట్టుక లేనిది. పుట్టుక లేనిది అంటే ఎప్పుడు పుట్టిందో తెలియనిది. ఋషులు అన్ని సత్యాలతో బాటు అమ్మవారి పుట్టుక గురించిన సత్యం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసే ఉంటారు. ఆ ప్రక్రియలోనే యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలను, కల్పాలను కూడా దాటి వెళ్ళారు/చూసారు. బ్రహ్మల వయస్సు కూడా తెలుసుకున్నారు. అమ్మవారి వయస్సును మాత్రం తెలుసుకోలేక పోయారు.
" వేదాహం సమతీతాని
వర్తమానాని చార్జున,
భవిష్యాణి చ భూతాని
మాం తు వేద న కశ్చన "
- భ.గీత 7:26
పరమాత్మ " ఓ అర్జునా! గతకాలమునకు చెందినట్టివియు,వర్తమాన (ప్రస్తుత) కాలము నందున్నట్టివియు ఐన చరాచరప్రాణులన్నింటిని నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవుకాలమున ప్రభవించు (జన్మించు) ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తిశ్రద్ధలుగలవారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుగజాలరు " అన్నారు. శాశ్వతుడు పరమాత్మ.
అన్నమయ్య అంటారు:
" హరియే యెరుగును అందరి బ్రతుకులు
యిరవై యీతని యెరుగుటే మేలు!!
వెనకటి బ్రహ్మలు వేవేలసంఖ్యలు
యెనసి బ్రహ్మాండము లేలిరిట...."
- వి.3-255
వేలమంది బ్రహ్మలు పాలించారు ఈ బ్రహ్మాండాన్ని అన్నారు కీర్తనలో అన్నమయ్య. కోట్లసంవత్సరాలు పాలన చేసే బ్రహ్మగారు కూడా కాలానికి బద్ధుడు. చావుపుట్టుకలు ఉన్నవారు. ఒక బ్రహ్మ తరువాత ఇంకో బ్రహ్మ వస్తూంటారు సృష్టికి. అమ్మవారు కాలానికి అతీతులు, చావుపుట్టుకలు లేనివారు. శాశ్వతులు.
అందరికీ శాంతి సౌఖ్యాలను ప్రసాదించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏👍
ReplyDelete