అమ్మవారు అనుగ్రహించలేనిది అంటూ ఏమీ ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అనుగ్రహదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 273 వ నామం.
" అనుగ్రహదా " అంటే అనుగ్రహిస్తుంది అని. ఏమి అనుగ్రహిస్తారు?. ఏమయినా ఇవ్వగలరు. అమ్మవారు ఇవ్వలేనిది ఏముంటుంది. అలా అమ్మవారి అంతులేని అనుగ్రహం పొందాలంటే మనం ఏమి చేయాలి అన్నది ఆలోచించుకోవాలి.
శంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్థిస్తారు:
" కంచిత్కాలముమామహేశ
భవతః పాదారవిందార్చనైః,
కంచిద్ధ్యానసమాధిభిశ్చ
నతిభిః కంచిత్కథాకర్ణనైః,
కంచిత్కంచిదవేక్షణైశ్చ
నుతిభిః, కంచిద్దశామీదృశీం
యః ప్రాప్నోతి ముదా
త్వదర్పిత మనా జీవన్
స ముక్తః ఖలు " - 81
" ఓ గౌరీవల్లభా - కొద్దిసేపు నీ పాదకమలాలను ఆరాధించి, కొద్దిసేపు నీ ధ్యానంలో గడిపి, కొద్దిసేపు నీకు నమస్కరిస్తూ, కొంతసేపు నీ కధాశ్రవణం చేస్తూ, కొద్ది సమయం నీ దర్శనం చేస్తూ, కొంతసేపు నిన్ను స్తుతిస్తూ, కొన్ని క్షణాలు మనస్సు నీపై ఉంచే అవస్థను అలవరచుకున్నవారు జీవన్ముక్తులు అవుతున్నారు " అన్నారు శంకరులు.
అలాచేసిన కంచి పరమాచార్యులు, రమణమహర్షి వంటివారు జీవన్ముక్తులయారు.
సంసారసాగరంలో పడి ఈదుతూన్న మనవంటివారు అలా చేయలేకపోయినా అందరినీ సమభావంతో చూస్తూ, ఎవరిమీదా ద్వేషభావం లేకుండా, సహాయం చేయలేకపోయినా ఎవరికీ మనస్సులో కూడా హాని తలపెట్టకుండా ఉండగలిగితే అమ్మవారి అనుగ్రహం పొందడం అంత కష్టమేమీ కాదు.
మన మనసుల్లో ఎల్లప్పుడూ సత్సంకల్పాలే కలుగుతూండేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment