" యోగాదినోత్సవం " శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" యోగీ యుంజీత సతత
మాత్మానం రహసి స్థితః,
ఏకాకీ యతచిత్తాత్మా
నిరాశీరపరిగ్రహః "
- భ.గీత 6:10
అర్జునుడు పరమాత్మను అడుగుతాడు ఈ మనస్సును అదుపులో ఉంచుకోవడం ఎలా, సాధ్యమేనా అని.
అప్పుడు పరమాత్మ పైవిధంగా చెబుతారు. " రహసి " అన్నారు అంటే ఏకాంతం. అలాగే " ఏకాకి " అన్నారు. అంటే ఒంటరిగా కూర్చోమని. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది.
ఆయన " అవ్యాజకరుణామూర్తి ", జీవుడు ముక్తిపొందడానికి ఎంత చక్కటి మార్గాన్ని ఎంత విపులంగా తెలియచేసారు.
ఏకాంతంగా ఓ చక్కటి ప్రదేశంలో కూర్చోమన్నారు. అంత ఎత్తుకాని పల్లముకాని ఆసనమ్మీద కూర్చోవాలన్నారు. దానిమీద చక్కటి మెత్తటిచర్మం వస్త్రం వేసుకోమన్నారు ( 6:11,12 ). ఆసనం అలా ఉంటే ఎక్కువసేపు సౌకర్యంగా కూర్చోగలుగుతారని.
మితాహారం తీసుకోవాలన్నారు. అది ఎలాగో కూడా చెప్పారు. ఉదరాన్ని 4 భాగాలు చేసి 2 భాగాలు ఘనపదార్ధం ( అన్నం మొ.గునవి ) తో నింపి ఒకభాగం ద్రవంతో నింపమన్నారు. ఒకభాగం ఖాళీగా ఉంచితే మితాహారం తీసుకున్నట్లుగా భావించాలి. ఖాళీకడుపుతో అసలు చెయ్యకూడదన్నారు.
ఎంత అద్భుతంగా విపులంగా చెప్పారో చూడండి. ఖాళీకడుపు అయినా పొట్టనిండుగా ఉన్నా నిద్ర రావడానికి అవకాశముంది. మరి ఎత్తుపీటమీద కూర్చుంటే నిద్రమత్తులో క్రింద పడితే ఏమవుతుందో అందరికీ తెలుసు. అలాగే క్రింద కూర్చోవడంకూడా చాలామందికి కష్టమే కదా.
శరీరం, శిరస్సు, కంఠం సమముగ/తిన్నగా ఉంచుకుని దృష్టి నాశికాగ్రంపై ఉంచాలి ( 6:13,14 ) అన్నారు. కనుబొమల మధ్యనున్న భృకుటిపై దృష్టి నిలిపి జపం చేసుకోమన్నారు.
ఈధ్యానయోగం అతిగా తినేవారికి, అస్సలు తిననివారికి, అతిగా నిద్రపోయేవారికి అస్సలు నిద్రపోనివారికి అబ్బదు ( 6:16 ). మనస్సు ఎచటెచటికో పోతూ ఉంటుంది, వెనక్కు లాక్కొచ్చి మళ్ళీ ఆత్మయందు స్థాపితం చేస్తూ ఉండాలి ( 6:26,35 ).
యోగంతోగూడుకొనిన మనస్సు కలవారు అన్ని ప్రాణులను సమదృష్టితో చూడగలుగుతారు ( 6:29,30 ). తనలోనూ ఎదుటిప్రాణిలోనూ ఉన్నది ఒకటే చైతన్యం అని తెలుసుకోగలుగుతారు.
ఇది పరమాత్మ అర్జునుడికి చెప్పినట్లుకాక మన అందరికీ చెప్పినట్లుగా భావించి సంకల్పసిద్ధులవుదాం.
కపిల మహర్షి తన తల్లికి తరించడానికని తత్వం భోదిస్తూ " ధ్యానం చేయడానికి కష్టమయిన ఆసనంలో కూర్చుని శరీరాన్ని బాధపెట్టకూడదు. సుఖాసనంలో కూర్చుంటే చాలు " అని తెలియచేసారు.
" యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్ధో దనుర్ధరః,
తత్ర శ్రీర్విజయో భూతి
ర్ధృవా నీతిర్మతిర్మమ "
- భ.గీత 18:78
ఆయన " యోగేశ్వరుడు " - యోగాలన్నింటికీ ప్రభువు. మన చంచలమైన మనస్సును ఆయనవైపు మళ్ళించుకోమని పరమాత్మనే వేడుకుందాం.
అందరికీ " యోగాదినోత్సవం " శుభాకాంక్షలు - సూర్య.
శుభం భూయాత్
👍🙏
ReplyDelete