ధర్మపాలనతో బాటు అధర్మాన్ని ఖండిస్తూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" నిరామయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 876 వ నామం.
" నిరామయా " అంటే వ్యాధులు లేనిది. ఆమయం అంటే రోగం.
అమ్మవారు ధర్మస్వరూపిణి. ధర్మం ఆవిడ సహజ స్వభావం. రోగాలు ఎందుకుంటాయి అమ్మవారికి.
ఆయుర్వేదం ఏమి చెబుతూందంటే అన్ని వ్యాధులకు మూలం అధర్మం అని. మిగతా వైద్యములు కారణం కనుక్కుని మందులు ఇస్తాయి. కాని ఆయుర్వేదం/సనాతనధర్మం కారణం వెనుక కారణం చూస్తుంది.
వివరం చూద్దాం. చాలామటుకు రోగాలు నీరు, గాలి, ఆహారం వలన కలుగుతాయి. మనకు తెలిసిన విషయమే. చెట్లు నాటండి బాబూ, గాలి పాడయిపోతూంది అని ఊదరగొడుతూంటారు. ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అని ఎవరూ ఆలోచించరు. నదుల ప్రక్షాళన అని ఓ కార్యక్రమం పెడతారు. అధిక ఖర్చు. అసలు నదినీరు ఎలా పాడవుతూంది అనే ఆలోచన చేయరు. తినే తిండంతా కల్తీయే.
వీటన్నిటికీ మూలం అధర్మం. అధర్మమార్గంలో డబ్బు సంపాదన కోసం ప్రకృతిని పాడుచేయడం - అంటే విషపూరితమైన వ్యర్ధాలను నదిలోకి వదిలేయడం, చెట్లు కొట్టేయడం, ఎక్కువ పంటకోసం రసాయనిక ఎరువులు మందులు వాడడం. దాన్ని నిర్మూలించాలి. ఆ పని చేస్తే ప్రకృతి రక్షించబడుతుంది. అది మనల్ని రక్షిస్తుంది.
వ్యాసర్షి విరచిత భాగవతంలో పృధుచక్రవర్తి వృత్తాంతం ఉంది. ధర్మప్రభువు. అతని కాలంలో కూడా కరువుకాటకాలు వచ్చాయి. పృధువు ఆశ్చర్యపోయి భూమాతను ప్రశ్నిస్తారు. భూదేవి గోవు రూపంలో వచ్చి అంటుంది " ఋషులు కొన్ని నియమాలు పెట్టి వాటిని పాటిస్తే ప్రకృతి కాపాడబడుతుంది అని తెలియచేసారు. అప్పుడు చక్కటి ఆహారాన్ని, నీటిని, గాలిని ఇస్తుంది. కాని కొందరు స్వార్ధపరులు నియమాలు పాటించకుండా స్వలాభం కోసం ప్రకృతిని పాడుచేస్తున్నారు. నీ తండ్రి వేనుడు అధర్మపరుడు. అతని అధర్మపాలనే నేటి ఈ కరువుకాటకాలకు కారణం " అని.
ఆవు రక్తం నేలమీద పడితే భూకంపాలు, సునామీలు, కరువుకాటకాలు వస్తాయి అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. మరి రోజూ వేల గోవులను ఎలా మూర్ఖంగా చంపేస్తున్నారో చూస్తున్నాం/చదువుతున్నాం. దీని పర్యవసానం చాలా భయంకరముగా ఉంటుంది, అనుభవించక తప్పదు.
అరగంట కార్యక్రమం కోసం ఏళ్ళ వయస్సున్న చెట్లను కొట్టేయడం, అతిధి గృహాలకోసం కొండలు త్రవ్వేయడం చూస్తూంటే భూదేవి వేల సంవత్సరాల క్రితమే ఈ అనారోగ్యాలకు చెప్పిన కారణం నిజమని తెలిసిపోతూందిగా.
అధర్మానికి అడ్డుకట్ట వేస్తే ప్రజలు, సమాజం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
ధర్మమార్గంలోనే నడిపించడమే కాకుండా అధర్మమాన్ని ఎదిరించే శక్తిని కూడా ప్రసాదించమని అందరం అమ్మవారు " నిరామయ" ని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDelete