సాధన చేయగా చేయగా కొన్ని జన్మల తరువాత అయినా ముక్తి లభిస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ముక్తిరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 737వ నామం .
" ముక్తిరూపిణీ " అంటే మోక్షమే స్వరూపముగా గలది.
మోక్షం అంటే ఏమిటి?. జీవుడు ( మనం )లో ఉన్న చైతన్యం అంటే ఆత్మ పరమాత్మ యొక్క అంశ. ఆత్మ కర్మఫలాన్ని పూర్తిచేసుకుని పరమాత్మలో కలిసిపోవడమే మోక్షం.
సాధకుడు కోరుకునేది జీవన్ముక్తి, అంటే మోక్షం. స్వర్గం కాదు. పుణ్యఫలం అనుభవించడానికి మరణానంతరం స్వర్గంకి వెళ్ళినా ఆ పుణ్యఫలం అవగానే మళ్ళీ జన్మను తీసుకుంటాడు జీవుడు పాప ప్రక్షాళనకోసం. ఇక్కడ ఏసుఖానికైనా దుఃఖస్పర్శ ఉంటుంది. కాని స్వర్గం లో దుఃఖస్పర్శ ఉండదు. పాపం కూడా నశించాలంటే దుఃఖస్పర్శ తప్పదు. అందుకని మళ్ళీ జన్మతీసుకోవలసి వస్తుంది జీవుడికి. పాపపుణ్యాలు పూర్తిగా నశిస్తేనే జీవన్ముక్తి. ఇక మళ్ళీ జన్మ ఉండదు.
కాని ఆంత సులభం కాదు. కనబడే ప్రపంచం అంతా మహామాయ. సమాజం మనల్ని మనలా బ్రతకనివ్వదు. తెలియకుండానే లేక మనకు ఇష్టంలేని పనులను కూడా చేయవలసి వస్తూంటుంది.
ఇదే విషయాన్ని పరమాత్మ చెబుతారు:
" స్వభావజేన కౌంతేయ
నిబద్ధః స్వేన కర్మణా,
కర్తుం నేచ్ఛసి యన్మోహనాత్
కరిష్య స్వవశో2పి తత్ "
- భ.గీత 18:60
మోక్షసన్యాసయోగంలో పరమాత్మ అంటారు " కౌంతేయా, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మనుకూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు " అని.
ఎంత అద్భుతవిషయం. ప్రాణులు తమకు ఇష్టంలేని/చెయ్యకూడదనుకున్న పనులు కూడా గతంలో చేసిన కర్మఫలాలవల్ల చేస్తూంటారు అని.
త్రికరణశుద్ధిగా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే కొన్ని జన్మల తరువాత అయినా ముక్తి లభిస్తుంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment