సంతృప్తి ముఖ్యం, అది లేదు ఇది లేదు అని ఎల్లప్పుడూ బాధపడకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సదాతుష్టా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 921వ నామం .

" సదాతుష్టా " అంటే ఎల్లప్పుడూ సంతోషము గలది.

ధనం ఉన్నవారు ధనాన్ని ఇవ్వగలరు. విద్య ఉన్నవారు విద్యని ఇవ్వగలరు. అన్నీ ఇవ్వగలిగినవారు అమ్మవారే కనుక, ఏ జీవి అయినా ఎల్లప్పుడూ ఆఖరికి మరణంలో కూడా సుఖాన్ని సంతోషాన్నే కోరుకుంటాడు కనుక, అమ్మవారి దగ్గర సంతోషం ఎక్కువగా ఉండడం జీవుల అదృష్టం.

శ్రీసూక్తంలో అమ్మవారిని " మనసః కామమాకూతిం " - " మనసులో కలిగే కోరికలన్నీ సంతోషాన్నిచ్చేవిగా అనుగ్రహించు, అంటే మంచి కోరికలే కలిగేలా చెయ్యి తల్లీ‌ " అని ప్రార్ధన చేస్తాం.

అమ్మవారు అందరూ సంతోషంంగా ఉండాలనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారి వారి కర్మఫలాలను బట్టి ఎక్కువ తక్కువ సంతోషం పొందుతూ ఉంటారు. కోరిక తప్పు కాదు. కోరుకున్నది పూర్తిగా లభించనప్పుడు నా ప్రాప్తం ఇంతే అని సంతృప్తి చెందుతూ ఉండాలి.

చాగంటివారు ఓ సారి ప్రవచనం చేస్తూ " అమ్మవారి దయవల్ల నాకు తెలిసిన విషయాలు చెబుతూ వేల ప్రవచనాలు చేసాను. ఆ అదృష్టానికి సంతోషించాలి. అంతేకాని అయ్యో ఒక్క కచేరీయేనా చేయలేకపోయానే అని అస్తమానూ ఏడవడం ఎందుకు? " అన్నారు. ఉన్నదానితో " అమ్మవారి అనుగ్రహం " అనుకుని ఆనందపడాలి. 

" అశాంతస్య కుతః సుఖం " - భ.గీత 2:66 

" ఎప్పుడూ అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది " అన్నారు పరమాత్మ.

మంచి చేయకపోయినా పరవాలేదు. మనస్సులో కూడా ఎవరికీ చెడు జరగాలి అని కోరుకోకూడదు అంది సనాతనధర్మం. అలా ఉంటే అమ్మవారు సంతోషిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబం, సమాజం, దేశం, ప్రపంచం కూడా శాంతితో వర్ధిల్లుతుంది.

"సర్వే జనాః సుఖినోభవంతు"

మా మనసుల్లో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే కలిగించు తల్లీ అని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ