సమాజం భ్రష్టుపట్టిపోతే అమ్మవారు చూస్తూ ఊరుకోదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మహాప్రళయసాక్షిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 571వ నామం.

కల్పాంతంలో సృష్టి అంతా తనలో లయమయి పోతూ ఉంటే అమ్మవారు సాక్షిగా నిర్వికారంగా చూస్తూ ఉంటారు( ట ).

అసలు లయం దేనికి?.

ప్రస్తుతం కలియుగం ప్రారంభం. ఇప్పుడే ఎందరో అధర్మపరులను, స్వార్ధపరులను చూస్తున్నాం. సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో చూస్తున్నాం. 20/25 ఏళ్ళ వయసున్న పచ్చటి చెట్లను అరగంట " నాయకుడి సభ " కోసం నిర్దాక్షిణ్యంగా కొట్టిపడేస్తున్నారు. అతిధి గృహాలకోసం రక్షణనిచ్చే కొండలను త్రవ్వి పడేస్తున్నారు. మరి కలియుగాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

అప్పుడప్పుడు వార్తలు చదువుతూంటాం. ప్రమాద స్థితిలో ఉన్న భవనాలను వంతెనలను ప్రభుత్వం కూల్చేయడం. 

అమ్మవారు ఇంక ఏమాత్రం బాగు చేయడానికి అవకాశం లేని తన సృష్టినంతా తనలో లయం చేసేసుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది.

క్రొత్త భవనం కట్ఠాలంటే పూర్తిగా పాడయిపోయిన ప్రాత భవనం కూల్చక తప్పదు. క్రొత్త సృష్టి చేయాలంటే పూర్తిగా భ్రష్టు పట్టిన ప్రాత సృష్టిని లయం చేయక తప్పదు.

ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్థిస్తారు:

" కిం బ్రూమస్తవ సాహసం 

  పశుపతే కస్యాస్తి శంభో 

  భవద్ధైర్యం చేదృశమాత్మనః 

  స్థితిరియం చాన్యైః 

  కథం లభ్యతే ।

  భ్రశ్యద్దేవగణం   

  త్రసన్మునిగణం 

  నశ్యత్ప్రపంచం లయం

  పశ్యన్నిర్భయ ఏక ఏవ 

  విహరత్యానందసాంద్రో   

  భవాన్ " - 34

" ఓ మహాదేవా, పారిపోతూన్న దేవతాబృందాలు గలదీ, నాశనం అయిపోతూన్న ప్రపంచం గలదీ అయిన ప్రళయాన్ని చూసి నువ్వు ఒక్కడివే ఏ భయం లేకుండా సంచరించగలిగావు. 

అటువంటి నీ సాహసాన్ని ఎలా శ్లాఘించేది?. 

నీవంటి ధైర్యం ఇంకెవరి కుంటుంది?. ఇలాంటి ‌స్థిరత ఇతరులకెలా కలుగుతుంది? " అని ప్రార్థిస్తారు శంకరులు.

భూకంపాలు, సునామీలు చేసిన విధ్వంసంయొక్క చిత్రాలను చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. మరి ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఎంత ధైర్యం కావాలి.

విష్ణుసహస్రంలో " అంతకః " అని ఒకనామం ఉంది. ఆదిశంకరులు ఆ నామానికి " ప్రళయకాలంలో సర్వమునూ అంతము చేయువాడు " అని భాష్యం చెప్పారు.

ధర్మో రక్షతి రక్షితః.

అందరి మనసుల్లో సత్సంకల్పాలే సదా కలిగేలా అనుగ్రహించమని అమ్మవారిని వేసుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ