బంధాలను మరీ పెంచేసుకోకూడదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బంధమోచనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 546 వ నామం.
" బంధమోచనీ " అంటే " అజ్ఞాన ( సంసార ) బంధము నుండి విడిపించునది.
బంధము అంటే అజ్ఞాన బంధం. ధర్మబద్ధమయిన బంధం ఉండాలి. లేకపోతే జీవితం నిస్సారం. కాని బంధాలు శాశ్వతం అనుకుంటూ అదే లోకంలో ఉండకూడదు.
ఓ ఉదాహరణ చూద్దాం. మీ సంతానం బాగుకోసం, అభివృద్ధికోసం మీరు ఎంతో కష్టపడి ఉంటారు, త్యాగాలు చేసి ఉంటారు. వారి సంతానం కోసం వారు కష్టపడతారు. మనుమల విషయంలో మీరెందుకు ప్రతీదానిలోనూ కలుగజేసుకుని బాధపడడం. అదే అజ్ఞానబంధం.
రాముడిని ఎలాగయినా అరణ్యవాసం మానిపించి అయోధ్యకు తీసుకుని వెళ్ళాలని అందరూ ప్రయత్నం చేసారు. జాబాలి దశరధుని సలహాదారు. ఆయన రాముడితో " అస్తమానూ తండ్రికిచ్చిన మాట అంటావు. తండ్రి ఎవరు, కొడుకు ఎవరు. ఈ బంధాలేమిటి " అంటారు. రాముడు కోపంతో " నా తండ్రికి నీవంటివారు సలహాదారుగా ఉన్నందుకు నేను సిగ్గు పడుతున్నాను " అన్నారు.
ఇంద్రజాలం జరుగుతూంది. దానికి రుసుం ఉంటుంది. ఇంద్రజాలికుడు చేసేవేవీ నిజాలు కావని తెలుసు. కాని రుసుం కట్టి సమయం వృధా చేసుకుని మరీ ఎందుకు చూస్తాం. ఎందుకంటే అది ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగచేస్తుంది. ఇంద్రజాలికుడిని అభినందిస్తాం. చూసిన విషయాలని అక్కడే వదిలేస్తాం. సంసారచక్రంలో బంధాలు కూడా అటువంటివే.
కుంతీదేవి కృష్ణపరమాత్మకి మేనత్త. ఎన్నో కష్టాలు పడింది. " చాలా కష్టాలు పడ్డావు. ఏమయినా కోరిక కోరుకో అత్తా " అంటారు పరమాత్మ. ఆవిడ 3 కోరికలు కోరుతుంది:
1. ఎప్పుడూ కష్టాలు ఉండేలా చూడు. కష్టాలు ఉంటే ఎప్పుడూ నీ స్పృహలో ఉంటాను. అది నాకు వరం.
2. గంగానది ఎలా ప్రవహించి సముద్రాన్ని చేరుతుందో అలా నా ఆలోచనలన్నీ ఎల్లప్పుడూ నీ వైపే ప్రయాణించేలా అనుగ్రహించు.
3. నా పుత్రులపైనా, నా వంశంమీదా ఉన్న నా బంధాన్ని తొలగించు.
ఈ 3వ కోరిక అద్భుతం. ఆవిడకు పుత్రులమీద, వంశంమీద ప్రేమలేదని కాదు. అజ్ఞానబంధాన్ని తొలగించమని కోరుకుంది.
అదే అమ్మవారు అనుగ్రహించేది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment