సంసారం సాగరం దుఃఖం అంటూ బాధపడిపోనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భవచక్రప్రవర్తనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 843 వ నామం.
" భవచక్రప్రవర్తనీ " అంటే " సంసార చక్రమును ప్రవర్తింపచేయునది ". భవ అంటే సంసారం, ప్రవర్తింపచేయడం అంటే అనుకూలంగా చేయడం. సంసారంలో ఉండేటట్లు చేయడం.
అందరూ సంసారం అనగానే చికాకు పడిపోయి వైరాగ్యం చెందుతే ఎలా. జీవుడు శరీరాన్ని తీసుకునేది కర్మఫలాలు ( మంచీ చెడూ ) అనుభవించి ముక్తి పొందడానికి. మరి సంసారమే లేకపోతే శరీరం పొందే అవకాశం ఎక్కడ ఉంది. సంసారచక్రం కొనసాగేదెలా. ఇంతమంది వివాహాలు చేసుకుని సంసారాలు చేస్తున్నారంటే ఏదో మహత్తు ఉన్నట్లేగా. అలా కొత్తదనం, ఆకర్షణ ఉండేలా అమ్మవారు చేస్తూ ఉంటారు.
వ్యాసమహర్షి ఓరోజు స్నానానికని నదికి వెడుతున్నారు. ఓ చెట్టు మీద ఉన్న పక్షులను చూసి ఆశ్చర్యపోయారు. మగపక్షి తెచ్చిన ఆహారాన్ని ఆడపక్షి తీసుకుని పిల్లపక్షి నోట్లో పెడుతూంది. ఎంత మధురంగా ఉంది, పక్షులే సంసారాన్ని ఇలా ఆనందిస్తూంటే మనషుల గురించి ఇంక చెప్పేదేముంది అనుకుని తను కూడా ఓ సుపుత్రుడిని పొందాలని గాఢంగా కోరుకున్నారు. శుకజననం జరిగింది.
అలా అమ్మవారు సంసారచక్రాన్ని ఆకర్షణీయంగా చేస్తారు.
జరత్కారు అని ఒక ముని ఉండేవాడు. ఈ సంసార జంఝాటం అవీ పెట్టుకుంటే కష్టం, అందుకని సన్యాసి అయి మోక్షసాధన చేద్దాం అనుకున్నాడు. ఆయన కూడా మహాపండితుడు. ఓ రోజు అడవిలో వెడుతూంటే చెట్టుకొమ్మకి కొందరు జీవులు వ్రేలాడుతున్నారు. క్రింద భయంకరమైన మంటలు. మీ పరిస్థితికి కారణం తెలియచేయండి, నేను సహాయం చేస్తాను అన్నారు జరత్కారు. వారు అన్నారు " ఎవరూ ఏమీ చేయలేరు. మా వంశంలో జరత్కారు అని ఒక పనికిమాలినవాడు జన్మించాడు. వాడు వివాహం చేసుకోడు. వాడికి సంతానం కలుగుతేనే మాకు విముక్తి " అని. జరత్కారుకి మతిపోయింది. సరే నా పేరుతోనే ఎవరయినా స్త్రీ ఉంటే వివాహం చేసుకుంటాను అన్నారు జరత్కారు. ఈ విషయాన్ని అక్కడే తిరుగుతూన్న నాగులు విన్నాయి. వారి సోదరి పేరు జరత్కారి. ఆమెనిచ్చి వివాహం చేయడం, వారికి కుమారుడు కలగడం జరిగింది. వారి కుమారుడే ఆస్తీకుడు , ఇతనే జనమేజయుడి సర్పయాగాన్ని నిలువరించాడు. అలా ఉంటాయి అమ్మవారి ప్రణాళికలు.
సృష్టి కార్యక్రమం సజావుగా సాగేలా ఉండేందుకు సంసారచక్రం అనుకూలంగా, నిత్యనూతనంగా ఉండేలా చూస్తారు అమ్మవారు. అలా కాకపోతే శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, త్యాగయ్య, కంచి పరమాచార్య వంటివారు ఈ భూమిమీద నడయాడేవారా?
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment