మనువు అంటే ఆలోచనచేసేవాడు - మనువు నుంచి మనిషి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మనువిద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 238వ నామం .
" మనువిద్యా " అంటే మనువు ఉపదేశించిన విద్యా స్వరూపురాలు.
మనువు ఎవరు?. బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన మహర్షి. ఒక్కో మనువు సుమారు 31 కోట్ల సం.లు పాలన చేస్తారు. బ్రహ్మగారి ఒకరోజులో 28 మంది ( పగలు 14, రాత్రి 14 ) మనువులు పాలన చేస్తారు. 31 కోట్ల సం.లు పాలించే ఆయన ఎంత చక్కటి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. 5 ఏళ్ళు పాలన చేసేవారే పథకాలకి పుట్టబోయే మునిమనమల పేర్లు కూడా పెట్టేసుకుంటున్నారు.
విష్ణు సహస్రనామాలలో " మనుః " అని ఒక నామం ఉంది. దానికి ఆదిశంకరులు " ఆలోచన చేయగలిగినవాడు " అని భాష్యం చెప్పారు. ఎంత చక్కటి విషయం. 84 లక్షల జీవరాశులలో మనిషి ఒక్కడే బుద్ధిజీవి. అంటే ఆలోచన చేయగలిగినవాడు. ఈ మను శబ్దం నుంచే " మనిషి " అనే పదం వచ్చినట్లు తెలుస్తూంది.
మనువు ఆలోచనలలోనూ, ఆయన ఇచ్చే విద్యలోనూ అమ్మవారు స్థితులయి ఉంటారు. మనుస్మృతి ఎంత అద్భుతం. ఎన్ని అద్భుత విషయాలు చెప్పారు. పెద్దలను గౌరవిస్తే ఆయుష్షు, సంపద పెరుగుతుంది అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారన్నారు. భూమిని నదులను చెట్లను జంతువులను పూజించమన్నారు. సత్యమయినా అప్రియమయినది చెప్పకూడదన్నారు. జంతుహింసే కాదు అసలు ఏ హింసా కూడదన్నారు. ఇటువంటివన్నీ వదిలేసి " న స్త్రీ స్వాతంత్ర్యమర్హసి " అంటారా అని పనికిమాలిన చర్చలు. సీతాదేవి అపహరించబడింది. ద్రౌపది అవమానింపబడింది. ఈ కాలంలో కూడా ఎక్కువగా స్త్రీలు బాధింపబడి చంపబడటం చూస్తున్నాం/వింటున్నాం కాని పురుషులను కాదు. వేల సం.లకు పూర్వమే జాగ్రత్తపడమని చెప్పిన విషయం అది. ఎంత అద్భుతం, దూరదృష్టి.
" తన్మే మనః శివసంకల్పమస్తు - సంకల్పసూక్తం " - మా మనస్సులలో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే కలిగేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment